Telugu Gateway
Andhra Pradesh

చ‌నిపోయిన వారికి స్వాగ‌తం ప‌లికిన ఏపీ స‌ర్కారు!

చ‌నిపోయిన వారికి స్వాగ‌తం ప‌లికిన ఏపీ స‌ర్కారు!
X

ఏపీ స‌ర్కారు ఏదో ఒక వెరైటీ ప‌నుల‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. అలాంటిదే ఈ ఘ‌ట‌న కూడా. రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌భుత్వం సోమ‌వారం నాడు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డులు అంద‌జేశారు. దీని కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. వివిధ విభాగాల్లో చ‌నిపోయిన ప్ర‌ముఖుల‌కు కూడా అవార్డుల‌ను గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అందులో జ‌ర్న‌లిజం విభాగం నుంచి దివంగ‌త కె. అమ‌ర్ నాథ్ కూడా ఉన్నారు. సీనియర్ జ‌ర్న‌లిస్టుగానే కాకుండా ఆయ‌న యూనియ‌న్ వ్య‌వ‌హారాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. అంతే కాదు..ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) స‌భ్యుడిగా కూడా ప‌నిచేశారు. ఆయ‌న‌కు కూడా ఏపీ ప్ర‌భుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ప్ర‌క‌టించింది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా సోమ‌వారం నాడు అవార్డుల అంద‌జేసే కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా దివంగత అమ‌ర్ నాథ్ కు స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు పోల్ బోర్డులు ఏర్పాటు చేశారు. అంటే జాబితాలో ఉన్న వారిలో ఎవ‌రు చ‌నిపోయారు...మిగిలిన వారు ఎవ‌రు అన్న విష‌యాన్ని నిర్వాహ‌కులు ఏ మాత్రం గ‌మ‌నంలోకి తీసుకోకుండా అంద‌రికీ ఒక‌టే అన్న చందంగా ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం మీకు స్వాగ‌తం ప‌లుకుతుంది అంటూ పోల్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ న‌డుస్తోంది. ఇదిలా ఉంటే ఈ అవార్డుల ప్రధానోత్స‌వం కార్య‌క్ర‌మానికి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్, వైఎస్ విజ‌య‌మ్మ‌లు కూడా హాజ‌రయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్ఆర్ అని వ్యాఖ్యానించారు. కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ అవార్డుల ఎంపిక జరిగిందన్నారు. విజయవాడలోని ఏ–కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రదానం చేశారు.

కేవలం సేవలను పరిగణనలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశామన్నారు. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామని తెలిపారు. . కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామన్నారు. రైతులు, రచయితలు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ఎంపిక చేశామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగుజాతికి శుభాకాంక్షలు. సామాన్యులుగా ఉన్న అసామాన్యుల మధ్య సమయం గడపడం నా అదృష్టం. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని పలు సూచనలు వచ్చాయి. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్‌ ప్రదానోత్సవం నిర్వహిస్తున్నాం. నిండైన పంచెకట్టుతో వైఎస్సార్‌ ప్రజల గుండెల్లో నిలిచారు. వైఎస్ఆర్ ర్‌ ఆకాశమంత ఎత్తు ఎదిగిన మనిషి'' అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్‌ 1న వైఎస్ఆర్ అవార్డులు ప్రదానం చేస్తామని సీఎం వెల్లడించారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేస్తామన్నారు. అచీవ్‌మెంట్‌ అవార్డు పొందిన వారికి రూ.5 లక్షలు కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేయనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Next Story
Share it