Telugu Gateway
Andhra Pradesh

పీఆర్సీ ర‌గ‌డ‌..ఏపీ స‌ర్కారు వ‌ర్సెస్ ఉద్యోగులు

పీఆర్సీ ర‌గ‌డ‌..ఏపీ స‌ర్కారు వ‌ర్సెస్ ఉద్యోగులు
X

ఆంధ్ర‌ప్రదేశ్ లో ఉద్యోగులు వ‌ర్సెస్ స‌ర్కారు అన్న‌ట్లు త‌యారైంది ప‌రిస్థితి. స‌త్వ‌ర‌మే పీఆర్ సీ అమ‌లు చేయాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల నేత‌లు గురువారం నాడు జీఏడీ కార్య‌దర్శి శ‌శిభూష‌ణ్ కుమార్ తో స‌మావేశం అయ్యారు. అయితే ఈ భేటీ వ‌ల్ల ఎలాంటి ఫలితం లేద‌ని ఉద్యోగ సంఘ నేత‌లు ప్ర‌క‌టించారు. ఈ స‌మావేశం అనంత‌రం ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. 'వెెెంటనే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సభ్య సంఘాల మెంబర్ షిప్ వివరాలు కూడా కోరాం. సీఎంఓ అధికారులతో పీఆర్సీ నివేదికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. పీఆర్సీ నివేదికను ఇప్పుడే ఇవ్వలేమని శశిభూషణ్ చెప్పారు. నా చేతుల్లో ఏం లేదు.. సీఎం, సీఎస్ చేతుల్లోనే అంతా ఉందని శశిభూషణ్ స్పష్టం చేశారు. రెండు జేఏసీలు కలిసినప్పుడు వెంకట్రామిరెడ్డిని కూడా మాతో కలవాలని కోరాం. బేషజాలు పక్కన పెట్టాలని కోరాం. మా మీద ఏ ఆరోపణలు చేసినా మేం స్పందించాల్సిన అవసరం లేదు. మేం మా దారి తప్పం.. కలిసి రావాలని వెంకట్రామిరెడ్డిని కోరుతున్నాం. పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందంటే మాకు అనుమనాలు వస్తున్నాయి. ప్రభుత్వమే చంద్రశేఖర్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చింది.' అన్నారు. ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ 'పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో అర్ధం కావడం లేదు. పీఆర్సీ నివేదికను మేమూ స్టడీ చేయాలి. మా డిమాండ్లు ఆ నివేదికలో ఉందో లేదో మాకూ తెలియాలి కదా..? పీఆర్సీని వెంటనే అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా..? లేదా..?. రేపటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ గురించే ప్రధానంగా ప్రస్తావిస్తాం.

వెంకట్రామిరెడ్డి కూడా మా సోదరుడే.. ఉద్యోగుల కోసమే మా ప్రయత్నం. పెద్ద జేఏసీలుగా ఉన్న మేం ఏకమై పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్నాం కాబట్టి.. పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరేం విమర్శలు చేసినా మేం పట్టించుకోం.' అని తెలిపారు. అంత‌కు ముందు స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొంత మంది ఉద్యోగ సంఘం నేత‌లు ప్ర‌భుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాల‌ని చూస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.'29వ తేదీన పీఆర్సీ నివేదిక ఇస్తామని ఇవ్వలేదు. పీఆర్సీ రిపోర్ట్‌పై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. రేపు మధ్యాహ్నం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. రేపటి సమావేశం తరువాత పీఆర్సీపై స్పష్టత రానుంది. రిపోర్ట్ ఇవ్వకుండా పీఆర్సీపై మేము మాట్లాడం. అధికారులు, ప్రభుత్వంపై కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న విమర్శలు బాధాకరం. మైలేజ్ కోసం కొన్ని ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. పీఆర్సీపై ఉద్యోగులకు ఒక క్లారిటీ ఉంది'' అని వెంక‌ట్రామిరెడ్డి తెలిపారు.

Next Story
Share it