ఇక బేరాలు లేవమ్మా!
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మారినప్పుడల్లా ఏవో కొన్ని ఛానెల్స్ కు చిక్కులు తప్పటం లేదు. జగన్ అధికారంలో ఉండగా ఏబి ఎన్ ఆంధ్ర జ్యోతి తో పాటు టీవీ 5 , మహా న్యూస్ లు కూడా నిషేధాన్ని చవిచూశాయి. వీళ్ళు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా...టీడీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ జగన్ సర్కారు వీటి ప్రసారాలను కట్ చేసింది. కానీ అప్పుడు ఏమీ మాట్లాడని జగన్ ఫ్యామిలీ పేపర్ సాక్షి మాత్రం ఇప్పుడు ట్రాయ్, కోర్ట్ ల ఆదేశాలు ఉన్నా కూడా మీడియా స్వేచ్ఛను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది అని వార్త రాసింది. దీనికి కారణం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో టీవీ 9 , సాక్షి తో పాటు మరో ఛానెల్ ను అనధికారికంగా బ్లాక్ చేయటమే. గతంలో కూడా ఇదే ట్రాయ్ ..కోర్ట్ లు చెప్పినా కూడా జగన్ సర్కార్ తన మోడల్ తాను ఫాలో అయిన విషయాన్ని మాత్రం సౌకర్యవంతంగా మర్చిపోయింది. కేబుల్ ఆపరేటర్ల తో చెప్పి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనధికారికంగా ఇప్పుడు మూడు ఛానెల్స్ ప్రసారాలకు బ్రేక్ లు వేసింది. దీంతో ఇప్పుడు ఒక ఛానెల్ అధినేత కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళ మీద ఎక్కడ పడతాం...ఏది అయితే అది అయింది...ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి డిష్ లు కొనుగోలు చేసి...తమకు కావాల్సిన ఛానెల్స్..ఓటిటి ల ప్యాకేజీలతో ప్రజలకు అందించాలనే ప్రతిపాదనను తెరమీదకు తీసుకు వచ్చింది. అయితే ఇందుకు అందరం కలిసి డబ్బులు సమకూర్చుదాం అని ప్రతిపాదించగా... పొద్దుతిరుగుడు ఛానల్ చైర్మన్ మాత్రం తన దగ్గర డబ్బులు లేవు అని...అన్ని మీరు పెట్టుకుంటే మాకు ఒకే అనటంతో ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆగిపోయినట్లు చెపుతున్నారు. అయితే ఒక కీలక ఛానల్ మాత్రం ఇక ప్రభుత్వం తో బేరాలకు పోవటం వేస్ట్ అని ...ఏది అయితే దానికి సిద్దపడటమే అనే నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. మరో వైపు అధికార టీడీపీ వర్గాల వాదన మాత్రం ఈ ఛానల్స్ సపోర్ట్ లేకుండానే...గత ఎన్నికల్లో ఘన విజయం సాధించామని...ప్రతిపక్షంలో ఉండగా పార్టీ తరపున నిర్వహించిన కార్యక్రమాలకు ఈ టీవీలు కనీస కవరేజ్ కూడా ఇవ్వలేదు అని..వీటితో ఇక ఎలాంటి చర్చలకు ఛాన్స్ లేదు అని చెపుతున్నాయి.