ఏపీలో జనవరి నుంచి వృద్ధాప్య పెన్షన్ 2500 రూపాయలు
వృద్ధాప్య పెన్షన్ పెంపునకు ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ ను దశల వారీగా మూడు వేల రూపాయలకు పెంచుతామని వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ హామీ షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగటం లేదు. అయితే కొత్త సంవత్సరం నుంచి మాత్రం వృద్ధాప్య పెన్షన్ ను మరో 250 రూపాయలు పెంచనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. దీంతో పెన్షన్ 2500 రూపాయలకు చేరనుంది. కొత్త ఏడాదిలో జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ మొత్తాన్ని .2,500 రూపాయలు అందజేయనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పెన్షన్ దారులకు 2,250 రూపాయలు అందిస్తోంది. సోమవారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
పెన్షన్ పెంపుతోపాటు ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాల షెడ్యూల్ ను ఖరారు చేశారు. డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకం, డిసెంబర్ 28న ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద వివిధ కారణాలవల్ల మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ చేపట్టనున్నారు. దీంతోపాటు జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు, అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45-60ఏళ్లు) 3 ఏళ్లలో రూ.45వేలు, జనవరిలో రైతు భరోసా అమలు చేయాలని ప్రతిపాదించారు.