పది బ్యాంకుల నుంచి 57 వేల కోట్ల అప్పుతీసుకున్న ఏపీ
ఆంధ్రప్రదేశ్ సర్కారు బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకుంది. ఈ వివరాలను కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ ఈ వివరాలను వెల్లడించారు. 10 జాతీయ బ్యాంకుల నుంచి 57,479 కోట్ల రూపాయల అప్పును ఏపీ ప్రభుత్వం చేసింది. ఏపీలో 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలను మంజూరు చేశాయన్నారు. అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని కేంద్రంస్పష్టం చేసింది. 2019 నుంచి 2021 నవంబర్ వరకు రుణాలను బ్యాంకులు మంజూరీ చేశాయి. అత్యధికంగా ఎస్‌బీఐ నుంచి 11,937 కోట్ల రూపాయల రుణాన్ని 9 సంస్థలు పొందాయి.
బీవోబీ నుంచి ఐదు కంపెనీలు, కార్పొరేషన్ను రూ.10,865 కోట్ల అప్పు తీసుకున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మూడు సంస్థలు రూ.7 వేల కోట్ల రుణం లభించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2970 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ. 750 కోట్ల అప్పును సంస్థలు తీసుకున్నాయి. ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 5,500 కోట్లు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ నుంచి రూ. 1,750కోట్ల రుణం తీసుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు, యూనియన్ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్ల రుణాలు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారీ ఎత్తున అప్పులు చేయటంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.