Telugu Gateway
Andhra Pradesh

ధ‌ర్మారెడ్డి త‌ప్ప‌..టీటీడీ ఈవోకి ఏపీలో అర్హులే లేరా?!

ధ‌ర్మారెడ్డి త‌ప్ప‌..టీటీడీ ఈవోకి ఏపీలో అర్హులే లేరా?!
X

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (ఈవో) పోస్టుకు ఆయ‌నకు అస‌లు అర్హ‌తే లేదు. కానీ ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు దొడ్డిదారిలో ఆయ‌న్ను మాత్రం అక్క‌డ కొన‌సాగిస్తోంది. అర్హ‌త లేక‌పోవ‌టంతో ఈవో పూర్తి స్థాయి అద‌నపు బాధ్య‌త‌ల పేరుతో ఈ తంతు జ‌రుపుతోంది. జ‌గ‌న్ స‌ర్కారుకు ధ‌ర్మారెడ్డిపై ఎందుకంత ప్రేమ అన్నది అధికార వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో ఎన్న‌డూలేని రీతిలో ఇటీవ‌ల భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు సంబంధించి కూడా ప‌లుమార్లు వివాదాలు త‌లెత్తాయి. టీటీడీలో ధ‌ర్మారెడ్డి హ‌వా కొన‌సాగేలా చాలా కాలం పాటు సీఎంవో లో స్పెష‌ల్ సీఎస్ గా ఉన్న జ‌వ‌హ‌ర్ రెడ్డికి ఈవో పోస్టు అలా కొన‌సాగించి..ధ‌ర్మారెడ్డికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇటీవ‌లే అది కూడా తీసేసి ఆయ‌న‌కే పూర్తి స్థాయి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ త‌రుణంలో ఆయ‌న డిప్యుటేష‌న్ గ‌డువు ముగిసిపోయింది. అయినా స‌రే ఆయ‌న కొన‌సాగుతూ వ‌చ్చారు.

ఇప్పుడు కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఏపీ ప్ర‌భుత్వ వినతి ధ‌ర్మారెడ్డి డెప్యుటేష‌న్ కొన‌సాగింపున‌కు ప్ర‌త్యేక అనుమ‌తి మంజూరు చేసింది. అంటే ఈ లెక్క‌న ఆయ‌న మ‌రో రెండేళ్ల పాటు టీటీడీలో కొన‌సాగ‌బోతున్నారు. ఈ రెండేళ్ళూ ఆయ‌నే పూర్తి స్థాయి ఈవో అద‌న‌పు బాద్య‌త‌లు చూస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఇందులో సీనియ‌ర్ ఐఏఎస్ ల‌ను మాత్ర‌మే నియ‌మిస్తారు. అది కూడా రాష్ట్రానికి చెందిన వారినే నియ‌మించే సంప్ర‌దాయం ఉండ‌గా..చంద్ర‌బాబు హ‌యాంలో దీన్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ రాష్ట్రంలో ఐఏఎస్ లు ఎవ‌రూ ఈ పోస్టుకు అర్హులు కారు అన్న చందంగా నాన్ ఐఏఎస్ ..అస్మ‌దీయుడు అయిన ధ‌ర్మారెడ్డిని అద‌న‌పు బాధ్య‌త‌ల పేరుతో ఈవోగా కొన‌సాగిస్తున్నారు. ఇది ఏ మాత్రం స‌రైన సంప్ర‌దాయం కాద‌ని అధికార వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. అయినా ఎవ‌రూ నోరు తెరిచి మాట్లాడే సాహసం చేయ‌ర‌న్న సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it