Telugu Gateway
Andhra Pradesh

ఎస్ఈసీ షెడ్యూల్ కు ఓకే

ఎస్ఈసీ షెడ్యూల్ కు ఓకే
X

కీలక పరిణామం. ఏపీ సర్కారు కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన షెడ్యూల్ కు ఓకే చెప్పేసింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీర్పు అనంతర పరిస్థితిపై పార్టీ ముఖ్యులు, ప్రభుత్వ అధికారులతో చర్చించారు. అడ్వకేట్ జనరల్ కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం చేసిన పోరాటంలో పరాజయం కూడా ఆనందమే అని వ్యాఖ్యానించారు. తమకు ఎలాంటి ఇగో సమస్యలు లేవన్నారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యం కోసమే ఇన్ని రోజులు ఎన్నికలు వద్దనుకున్నామని చెప్పారు. ఎవరిపైనా పైచేయి సాధించాలని ఎన్నికల వాయిదా కోరలేదన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని వెల్లడించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మధ్యలోనే నిలిపివేసి.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో కుట్ర ఉందని ఆరోపించారు.

వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌, ఎన్నికలు ఒకే సారి నిర్వహిస్తే గందరగోళానికి దారి తీస్తుందని సుప్రీంకు తెలిపినట్లు వెల్లడించారు. ఎన్నికల ద్వారా కరోనా పెరిగితే ఎస్‌ఈసీదే బాధ్యత అని సజ్జల వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. వాళ్ల ప్రాణాలే ముఖ్యం అని చెప్పారు. ఉద్యోగులతో సీఎస్‌ చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొంటామని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం వైసీపీదేనని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ దగ్గర జరిగిన సమావేశంలోనే ఎన్నికలకు సహకరించాలని నిర్ణయించటంతో సజ్జల ఈ మేరకు ప్రకటన చేశారు. సుప్రీం తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎస్‌ఈసీ కేంద్రానికి లేఖ రాయడం సరికాదు. ప్రభుత్వంతో చర్చించాలన్న ఆలోచన ఇప్పటికీ ఎస్‌ఈసీకి లేదన్నారు.

Next Story
Share it