Telugu Gateway
Andhra Pradesh

అధికార వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న అనుమతులు!

అధికార వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న అనుమతులు!
X

ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం గత కొన్ని రోజులుగా తాము రాష్ట్రానికి విరివిగా పెట్టుబడులు తెస్తున్నాం అని చెప్పుకొంటోంది. ఇందులో ఆక్షేపించాల్సింది ఏమి లేదు. అయితే ఈ పెట్టుబడులు పెడుతుంది, వీటి వెనక ఉన్నది ఎవరు అన్నది తెలిసినప్పుడే షాక్ కు గురి అవ్వకతప్పదు. లింగమనేని రమేష్. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా మందికి ఈ పేరు తెలుసు. రాజకీయ నాయకులకు అయితే ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉంటున్నది కరకట్టపైన ఉన్న ఆయన నివాసంలోనే. దీనిపై గతంలో ఎన్నో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఇది ఒక్కటే కాదు..ఆయన జనసేన పార్టీ కి చెందిన కీలక నేతలు అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కు కూడా అత్యంత సన్నిహితుడు అనే పేరు ఉంది. జనసేన పార్టీ కార్యాలయానికి కూడా లింగమేని రమేషే అతి తక్కువ ధరకు భూమి ఇప్పించినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇది అంతా ఓల్డ్ స్టోరీ. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన కు అటు టీడీపీ నుంచి, ఇటు జనసేన నుంచి కూడా రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తోంది అనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబి క్లియర్ చేసిన ప్రాజెక్ట్ లు కొన్ని చూస్తే లింగమనేని రమేష్ బంధువులకు సంబంధించినవి ఉండటం విశేషం. అయితే తెర ముందు వీళ్ళను పెట్టి తెర వెనక లింగమేని రమేష్ ఉండి ఈ కథ అంతా నడిపిస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ఉదంతం ఒకటి. ఈ కంపెనీ అనంతపురం జిల్లాలో ఏకంగా 1651 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రాజెక్ట్ పెడుతుంది అని చెపుతున్నారు. ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ప్రస్తుతం లక్ష్మి ప్రసాద్ యెర్నేని, పల్లవి చనమోలు ఉన్నారు. లక్ష్మి ప్రసాద్ యెర్నేని కి...లింగమనేని రమేష్ కి మధ్య దగ్గర బంధుత్వం ఉంది అని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇదే కంపెనీ లో కాకర్ల వినయ్ అనే వ్యక్తి గతంలో అదనపు డైరెక్టర్ గా ఉన్నారు. ఈ కాకర్ల వినయ్ ఎవరు అంటే లింగమనేని గ్రూప్ కు చెందిన పలు కంపెనీల్లో ఇప్పటికి డైరెక్టర్ గా ఉన్నారు. ప్రభుత్వం చెపుతున్న అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు నెట్ లో చూస్తే అనంతపూర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా చూపిస్తోంది. అయితే ఇందులో కూడా ఎకోరెన్ ఎనర్జీ ఇండియాలో డైరెక్టర్ గా ఉన్న లక్ష్మి ప్రసాద్ యెర్నేని ఉన్నారు.

ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఈ కంపెనీలో కూడా గతంలో ఇప్పటికీ ఎల్ఈపీఎల్ గ్రూప్ కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్న కాకర్ల వినయ్ ఉండటం విశేషం. అంతే కాదు కొత్తగా ఏపీ లో ప్రాజెక్ట్ దక్కించుకున్న కడప ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా వినయ్ గతంలో డైరెక్టర్ గా కొనసాగారు. ఇవి అన్ని చూస్తే పలు కొత్తగా ఆమోదం పొందిన పలు కంపెనీల మధ్య చైన్ లింక్ ఉంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ లను అమలు చేసే సామర్థ్యం ఈ ఇందులో కొన్ని కంపెనీలకు ఏ మాత్రం లేదు అని...ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అన్ని అనుమతులు తీసుకుని ఈ ప్రాజెక్ట్ లను అమ్ముకొని పోవటమే వీళ్ళ ఎజెండా గా కనిపిస్తోంది అని విద్యుత్ శాఖలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

లింగమేని రమేష్ కు వివిధ రూపాల్లో లింక్ ఉన్న కంపెనీ లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోవటంతో ఇది అంతా క్విడ్ ప్రో కింద సాగుతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు అన్ని అనుమతులు తీసుకుని ప్రాజెక్ట్ లు అమ్మేసినా తర్వాత కూడా ఎవరి వాటాలు వాళ్ళు తీసుకునే అవకాశం లేకపోలేదు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. మరో కీలక విషయం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు సాగుతున్నా కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నోరు తెరిచి మాట్లాడకపోవడం వెనక కారణం ఇదా అన్న చర్చ కూడా ఇప్పుడు అధికార వర్గాల్లో సాగుతోంది. గత జగన్ హయాంలో విద్యుత్ శాఖలో సాగిన అవినీతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మౌనాన్ని ఆశ్రయించటం ఎన్నో అనుమానాలకు కారణం అవుతోంది అని చెపుతున్నారు.

Next Story
Share it