Telugu Gateway
Andhra Pradesh

టిఈఎఫ్ఆర్ నివేదిక కోసం ఆర్ఎఫ్ పీ జారీ

టిఈఎఫ్ఆర్ నివేదిక కోసం ఆర్ఎఫ్ పీ జారీ
X

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో రెండు కొత్త ఎయిర్ పోర్టుల ప్రతిపాదనలను తెర మీదకు తీసుకు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అమరావతి తో పాటు శ్రీకాకుళంలో కూడా కొత్త ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇప్పుడు కొత్తగా ఒంగోలు తో పాటు నాగార్జున సాగర్ ల వద్ద కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయాలని తలపెట్టారు. దీనికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక (టిఈఎఫ్ఆర్) తయారు చేయానికి కన్సల్టెంట్స్ ను ఆహ్వానిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఎయిర్ పోర్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న సంస్థలు ఈ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ ఎఫ్ పీ) కి అనుగుణంగా జులై 29 నాటికి తమ ప్రతిపాదనలు సమర్పించాలని ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

దీంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా నాలుగు విమానాశ్రయాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో వైజాగ్ కు సమీపంలోనే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇది వచ్చే ఏడాది జూన్ నాటికి సిద్ధం కానుంది. మరో వైపు రాజధాని అమరావతి లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కోసం అని చెప్పి ప్రభుత్వం కొత్తగా అమరావతి లో రెండవ దశ భూ సమీకరణ కు సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఇందులో ఐదు వేల ఎకరాలు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కు అని చెపుతున్నారు. ఫస్ట్ టర్మ్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాగే జిల్లాకో విమానాశ్రయం అంటూ హంగామా చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా పలు కొత్త ఎయిర్ పోర్టు ప్రతిపాదనలు తెర మీదకు తెస్తున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే అప్పుడు ఫస్ట్ టర్మ్ లో కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రి గా టీడీపీ కి చెందిన అశోక్ గజపతి రాజు ఉంటే...ఇప్పుడు కూడా టీడీపీ కి చెందిన కె. రామ్మోహన్ నాయుడు ఇదే శాఖ బాధ్యతలు చూస్తున్నారు.

Next Story
Share it