అమరావతి తో మొదలు..తర్వాత విద్యుత్ పంపిణీ, సరఫరా ప్రైవేట్ పరం?!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రైవేట్ పై ఉన్న మోజు ప్రభుత్వ రంగ సంస్థలపై ఉండదు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రైవేట్ పైనే ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే తాను అధికారంలో ఉండి కూడా తన చేతిలో ఉన్న వ్యవస్థలు, సంస్థలు సరిగా పని చేయవు అనే సంకేతాలు ఇవ్వటానికి కూడా ఆయన వెనకాడరు. ఎందుకంటే ఆయన ప్రైవేట్ పై ప్రేమ చూపించటం వెనక బలమైన కారణాలు చాలానే ఉంటాయి. ఇప్పుడు తన కలల ప్రాజెక్ట్ గా చెప్పుకునే అమరావతి నుంచే అత్యంత కీలకమైన విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలను ప్రైవేట్ పరం చేయటానికి రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్ డీఏ ) ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం రాజధాని అమరావతిలో విద్యుత్ పంపిణీ, రిటైల్ సరఫరా వ్యవస్థను ప్రైవేట్ సంస్థతో కలిసి ప్రభుత్వం నిర్వహించనుంది. రాజధానిలో విద్యుత నెట్ వర్క్ అభివృద్ధి, ఆపరేషన్, నిర్వహణ, స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటు, వినిగయోగదారుల సేవలు, బిల్లింగ్, కలెక్షన్ వంటి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు.
దేశీయ, అంతర్జాతీయ సంస్థలు సి ఆర్ డీఏ జారీ చేసిన ఈఓఐ ప్రకారం ప్రైవేట్ సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 12 చివరి తేదీ...అక్టోబర్ 13 న బిడ్స్ తెరుస్తారు. రాజధానిలో అత్యాధునిక సౌకర్యాలతో అంతరాయాలకు తావులేని రీతిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు. కానీ ఇది అంతా ఒక ఎజెండా ప్రకారమే ముందుకు సాగుతుంది అని విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అత్యంత ఇష్ట పారిశ్రామికవేత్తకు చెందిన సంస్థకే ఈ ప్రాజెక్ట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి తెర వెనక ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి అని...టెండర్ నోటిఫికేషన్ కేవలం లాంఛనం మాత్రమే అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వాలు విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే భయంతో ఇంత కాలం వాయిదా వేసుకుంటూ వచ్చాయి.ఒకప్పుడు వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఇలాంటి షరతులు విధించేది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారు కూడా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు కావాలంటే విద్యుత్ రంగంలో పలు సంస్కరణలు అమలు చేయాలని షరతులు పెడుతోంది. దీని వెనక కొంత మంది ప్రైవేట్ సంస్థలకు మేలు చేసే ఆలోచనలు ఉన్నాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కారణాలు ఏమైనా కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నుంచి విద్యుత్ పంపిణీ, సరఫరా బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు అంతా రెడీ చేశారు.
ఇదే జరిగితే వినియోగదారులకు అందించే ప్రతి సర్వీస్ పై ప్రవేట్ సంస్థలు భారీ చార్జీలు వేస్తాయి. కొత్త కనెక్షన్ తో ప్రతి వ్యవహారం కూడా ఇప్పుడు ఉన్న దాని కంటే ఖరీదు అవుతుంది అని చెపుతున్నారు. అంతే కాకుండా విద్యుత్ సరఫరా, పంపిణీ ప్రైవేట్ చేతుల్లోకి వెళితే అంతా వాళ్ళ ఇష్టారాజ్యం గా మారుతుంది అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముందు రాజధాని అమరావతిలో మొదలు పెట్టి ఆ తర్వాత ఈ మోడల్ ను క్రమక్రమంగా రాష్ట్రమంతటికి విస్తరించే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇదే జరిగితే అంటే విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలు ప్రైవేట్ పరం అయితే ప్రజలపై అదనపు భారం పడటం ఖాయం అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.



