బెనిఫిట్ షోల దందాలు ఇక సాగవు..ఓన్లీ నాలుగు షోలే
ఏపీ సర్కారు ముందు నుంచి ప్రకటిస్తున్న ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల విధానానికి మార్గం సుగమం చేసింది. అంతే కాదు రాష్ట్రంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు బెనిఫిట్ షోలు వేసుకుని..500, 1000 రూపాయల లెక్కన టిక్కెట్లతో దోచుకోవటాన్ని నుంచి అనుమతించబోమని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఆయన బుధవారం నాడు శాసనసభలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సినిమా పరిశ్రమలో కొంత మంది పెద్దలు తాము ఏమి చేసినా ఎవరేమీ చేయలేరనే ఉద్దేశంతో ఉన్నారని..ఇక నుంచి అలాంటి వారికి అడ్డుకట్ట పడుతుందన్నారు. ఎక్కడైనా సరే రోజుకు నాలుగు షోలకే మాత్రమే అనుమతిస్తామన్నారు. బలహీనతలు సొమ్ము చేసుకునే వ్యవస్థను కట్టడి చేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆన్ లైన్ లోనే టిక్కెట్లు అమ్మితేనే దోపిడీని అరికట్టగలమన్నారు. షోలు కూడా ప్రభుత్వం నిర్దారించిన సమయంలోనే ప్రదర్శించాలని స్పష్టం చేశారు. పరిశ్రమ ప్రభుత్వ నిబంధనల కు లోబడే నడుచుకోవాలని తేల్చిచెప్పారు. పేదలు, మధ్య తరగతి ప్రజలను ఇష్టానుసారం దోచుకుంటామంటే కుదరదని తెలిపారు. సినిమా టిక్కెట్ల విక్రయానికి, పన్నులకూ మధ్య పొంతన ఉండటంలేదని తెలిపారు. సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ప్రభుత్వంపై నిందలు వేస్తే అర్థం ఉంటుంది...కానీ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం పై బురద వేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. కొంత మంది ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వం అప్పుల కోసం ఈ విధానం తేవటంలేదని తెలిపారు. బస్సు,రైలు టిక్కెట్లు ఆన్ లైన్ తీసుకోవడానికి లేని అభ్యంతరం సినిమా టిక్కెట్లపై ఎందుకు అని ప్రశ్నించారు. నూతన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.