ఏపీ సర్కారు సరికొత్త వ్యాపారం..మటన్ అమ్మకాలు

కేంద్రంలోని మోడీ సర్కారు అసలు ప్రభుత్వం వ్యాపారాలు చేయటం ఏమిటి?. కీలక రంగాలు తప్ప అన్నీ ప్రైవేట్ పరం చేస్తామంటోంది. వ్యాపారం ప్రైవేట్ వాళ్లు మాత్రమే చేయాలని చెబుతోంది. అందుకే లాభదాయక సంస్థలను కూడా అమ్మకాలకు పెట్టింది. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉంది. అంతే కాదు..ఇప్పుడు కొత్తగా అన్నీ తాకట్టు పెట్టి వాటిపై ఆరు ఓ ఆరు లక్షల కోట్ల రూపాయలు సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఏపీ సర్కారు మాత్రం వ్యాపారం ఏదైనా మేమే చేస్తామంటోంది. అది మద్యం అయినా..మాంసం అయినా..సినిమా టిక్కెట్లు అయినా. తొలుత ఇసుక వ్యాపారం చేసింది కానీ..మళ్ళీ ప్రైవేట్ కే అప్పగించేసింది. అయితే మందు వ్యాపారం మంచి లాభదాయకంగా ఉండటంతో అది మూడు పూవులు..ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రభుత్వమే లిక్కర్ విక్రయాలు చేసే విధానం ఒక్క ఏపీలోనే కాదు..దేశంలోని పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఏపీ సర్కారు ఇప్పుడు సర్కారు కొత్తగా సినిమా టిక్కెట్ల విక్రయానికి రెడీ అయింది.
ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మాంసం విక్రయాలకూ రంగం సిద్ధం చేస్తోంది. ఏపీ మీట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఈ విక్రయాలు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలుత నగరాలు,పట్టణాల్లో ప్రారంభించి తర్వాత క్రమక్రమంగా మండల కేంద్రాలు, పంచాయతీల్లోనూ ఈ మాంసం విక్రయ కేంద్రాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎపీఎండీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుబాటు ధరలో..ప్రజలకు ఆరోగ్యకర మాంసాన్ని అందించటమే ద్యేయంగా ఈ మటన్ వ్యాపారంలోకి ఎపీఎండీసీ ప్రవేశిస్తోందట. అంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల తరహాలోనే ప్రభుత్వ మాంస విక్రయ కేంద్రాలు కూడా రాబోతున్నాయి.