Telugu Gateway
Andhra Pradesh

ఏపీపీఎస్ సీ ఛైర్మ‌న్ గా గౌతం స‌వాంగ్..ఉత్త‌ర్వులు జారీ

ఏపీపీఎస్ సీ ఛైర్మ‌న్ గా  గౌతం స‌వాంగ్..ఉత్త‌ర్వులు జారీ
X

మాజీ డీజీపీ గౌతం స‌వాంగ్ ఏపీపీఎస్ సీ ఛైర్మ‌న్ గా నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ ఉత్త‌ర్వులు జారీ చేశారు. గ‌వ‌ర్న‌ర్ ఈ నియామ‌కానికి ఆమోదం తెల‌ప‌టంతో నోటిఫికేష‌న్ జారీ అయింది. దీంతో స‌వాంగ్ కు ఈ ప‌ద‌వి అప్ప‌గించే అంశంపై సాగుతున్న గంద‌ర‌గోళానికి తెర‌ప‌డిన‌ట్లు అయింది. ఇదిలా ఉంటే మంగళగిరిలోని 6వ బెటాలియన్ గ్రౌండ్‌లో ఇటీవ‌ల బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వీడ్కోలు కార్యక్రమం జ‌రిగింది. బెటాలియన్‌ పోలీసు కవాతు నిర్వహించింది. ఈసందర్భంగా బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్, నూతన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు.

అనంత‌రం స‌వాంగ్ మాట్లాడుతూ 'నా 36 సంవత్సరాల పోలీసు సర్వీసు ఇవాళ్టితో ముగుస్తోంది. డీజీపీగా 2 ఏళ్ల 8 నెలల కాలం పనిచేశా. ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల ప్రకారం ఈ రెండున్నర ఏళ్ల పాటు పని చేశాను. చాలా సంస్కరణలు, పోలీసు వ్యవహార శైలిలో మార్పులు తెచ్చేందుకు కృషి చేశాను. ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేసేందుకు పని చేశాను. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 ఏళ్ల 8 నెలల పాటు నన్ను డీజీపీగా కొనసాగించిన సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు.'అన్నారు.

Next Story
Share it