Telugu Gateway
Andhra Pradesh

బైజూస్ తో ఏపీ సర్కారు కీల‌క ఒప్పందం

బైజూస్ తో ఏపీ సర్కారు కీల‌క ఒప్పందం
X

విద్యా రంగానికి సంబంధించి ఏపీ స‌ర్కారు కీలక ఒప్పందం చేసుకుంది. ప్ర‌ముఖ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ తో ఏపీ స‌ర్కారు టై అప్ అయింది. గురువారం నాడు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్ ఎంవోయుపై సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో 'బైజూస్‌' వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ అమెరికా నుంచి పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడం సాధ్యం అవుతుంద‌ని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ విద్య ఇకపై ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది.

ఏడాదికి కనీసం రూ.20వేల నుంచి రూ.24వేలు చెల్లిస్తేకాని 'బైజూస్‌' ఇ– తరగతులు విద్యార్థులకు అందుబాలోకి రావు. అలాంటి నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. పాఠ‌శాల‌ల్లో నాల్గ‌వ త‌ర‌గ‌తి నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఎడ్యుటెక్ విద్య‌ను అందించ‌నున్నారు. దీంతో పాటు ప్ర‌తి సంవ‌త్స‌రం ఎనిమిద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు ట్యాబ్ లు ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలిపారు. ఈ సెప్టెంబ‌ర్ లోనే విద్యార్ధుల‌కు ట్యాబ్ లు అంద‌నున్నాయి. వీడియో కంటెంట్ ద్వారా పిల్ల‌ల‌కు అర్ద‌మ‌య్యేలా పాఠాలు చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

Next Story
Share it