ఏపీలో పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంపు
ఉద్యోగులకు పీఆర్సీ 23.29 శాతం
ఎట్టకేలకు ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన వెలువడింది. ఫిట్‌మెంట్‌ని 23శాతంగా ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఊహించని పరిణామం. అసలు ఎవరూ కూడా ఈ డిమాండ్ సర్కారు ముందు పెట్టలేదు. తెలంగాణలో పదవి విరమణ వయస్సు 61 సంవత్సరాలు చేస్తే..ఏపీ సర్కారు ఏకంగా 62 సంవత్సరాలకు పెంచింది. అయితే పెద్ద ఎత్తున రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఇచ్చే పదవి విరమణ సమయంలో బెనిఫిట్స్ ను వాయిదా వేసేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే వేతనాలు చెల్లించటానికే సర్కారు నానా కష్టాలు పడుతోంది. పదవి విరమణ పెంపు వెనక ప్రధాన కారణం ఇదే అని చెబుతున్నారు. పెంచిన జీతాలు జనవరి 1, 2022 నుంచి అమలు చేయనున్నారు. పీఆర్సీ అమలు జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్ అమలు ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్ 30లోగా నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుందని చెబుతున్నారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.