ధర్మారెడ్డి కోసమే జవహర్ రెడ్డిని 'అలా కొనసాగిస్తున్నారా?!'
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) పోస్టు అత్యంత కీలకం. టీటీడీ వ్యవహరాలు చక్కదిద్దటానికి ఆయన సమయం ఏ మాత్రం సరిపోదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈవో పోస్టును ఓ ప్రహసనంగా మార్చేసింది. సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి అదే సీన్. జవహర్ రెడ్డిని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్న సమయంలో ఆయన్ను టీటీడీ ఈవోగా 2020 అక్టోబర్ లో నియమించింది. తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో ఆయనకు ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని కోవిడ్ సమయంలో కొంత కాలం అమరావతి కేంద్రంగా సేవలు అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అది పూర్తయిన తర్వాత జవహర్ రెడ్డి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అంతటి కీలక బాధ్యతలు అప్పగించిన సమయంలోనూ ఆయనకు టీటీడీ ఈవో అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇది అక్కడతో ఆగలేదు. ఇటీవలే జవహర్ రెడ్డిని సీఎం జగన్ సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అయినా సరే ఆయనకు టీటీడీ ఈవో అదనపు బాధ్యతలు అలాగే కొనసాగుతున్నాయి.
సీఎం ముఖ్య కార్యదర్శి పోస్టు అంటే పలు శాఖల మధ్య సమన్వయంతో పాటు సీఎంకు చెందిన కీలక మైన వ్యవహారాలు అన్నీ ఆయనే చూడాల్సి ఉంటుంది. అలాంటి కీలక పదవిలో ఉన్న జవహర్ రెడ్డి తాడేపల్లిలో కూర్చుని టీటీడీ ఈవో బాధ్యతలు ఎలా నిర్వహిస్తారు. అసలు ఇది ఏమైనా ఆచరణ సాధ్యం అయ్యే పనేనా?. కొద్ది రోజుల క్రితం తిరుమలకు భారీ ఎత్తున భక్తులు తరలిరావటంతో తొక్కిసలాట జరిగింది. దీనికి అదనపు ఈవోగా ఉన్న ధర్మా రెడ్డి భక్తులకు క్రమశిక్షణ లోపించిందని..భక్తులు పెద్ద సంఖ్యలో రావటంతో తాము చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. మీడియాలో ఈ వ్యవహరం రచ్చరచ్చ అయిన తర్వాతే టీటీడీ ఆకస్మాత్తుగా వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత మాట్లాడిన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి భక్తుల అంచనా విషయంలో పొరపాటు జరిగిందని అంగీకరించి..అయినా వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని ప్రకటిస్తే ధర్మారెడ్డి మాత్రం మేం అంతా బాగానే చేస్తున్నాం..అయినా సరే మాపై విమర్శలు చేస్తారా అంటూ ప్రశ్నించారు.
అత్యంత కీలకమైన ఈవో పోస్టు విషయంలో జగన్ సర్కారు ఎందుకు ఇలా చేస్తుంది అంటే..టీటీడీలో ధర్మారెడ్డికి పూర్తి స్థాయి పెత్తనం చెల్లుబాటు అయ్యేలా చేసేందుకే జవహర్ రెడ్డి సీఎంవోలో ఉన్నా ఈవో అదనపు బాధ్యతలు అప్పగించి అలా కొనసాగిస్తుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా జరగగలేదని..ఎప్పుడైనా ఇలా ఓ వారం..పది రోజుల పాటు టీటీడీ ఈవో వంటి పోస్టు అదనపు బాధ్యతలు ఇస్తారు కానీ...నెలల తరబడి ఇలా చేయటం అంటే కేవలం ధర్మారెడ్డి కోసమే ఇదంతా చేస్తున్నట్లు కన్పిస్తోందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. నిత్యం టీటీడీ చుట్టూ వివాదాలు అలుముకుంటున్నా ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయి ఈవోను మాత్రం నియమించటం లేదు. కోవిడ్ పూర్తిగా సద్దుమణగటంతో రెండేళ్ల పాటు దేవుడి దర్శనాలకు దూరంగా ఉన్న భక్తులు భారీ ఎత్తున వస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు కిటకిటాలాడుతున్నాయి. ఇంతటి కీలక సమయంలో పూర్తి స్థాయి ఈవోను నియమించటం సర్కారు అలసత్వం ప్రదర్శించటం సరికాదంటున్నారు.