Telugu Gateway
Andhra Pradesh

తెలంగాణ సర్కారు పై ఒత్తిడి కోసమే ఇంత ముందు జీవో ఇచ్చారా?!

తెలంగాణ సర్కారు పై ఒత్తిడి కోసమే ఇంత ముందు జీవో ఇచ్చారా?!
X

తెలంగాణ లో మీరు బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వరా?. మేము ఇస్తాం. మీరు కొత్త సినిమాలకు రేట్లు పెంచరా. మేము పెంచుతాం అన్నట్లు ఉంది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు. సహజంగా టికెట్ రేట్ల పెంపు జీవో లు కూడా సినిమా విడుదలకు ఒకటి, రెండు రోజుల ముందు మాత్రం వస్తాయి. కానీ సినిమా విడుదల కు ఆరు రోజుల ముందు ఆంధ్ర ప్రదేశ్ లో రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోస్ తో పాటు టికెట్ రేట్ల పెంపు జీవో వెలువడింది. గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షో టికెట్ రేట్ ధరను ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని మల్టీఫ్లెక్స్ లలో ఇప్పుడున్న టికెట్ ధర మీద 175 రూపాయలు, సింగిల్ స్క్రీన్ టికెట్ ధర మీద 135 రూపాయలు అదనంగా పెంచుకోవటానికి ఈ నెల 23 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. సహజంగా అదనపు షో లు...రేట్లు పెంపు ఒక వారానికి ఇస్తారు. కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అందుకు బిన్నంగా పది రోజుల పైనే అదనపు షో లు...అదనపు రేట్లకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

జనవరి 23 వరకు అదనపు రేట్లు అమలులో ఉండనున్నాయి. ఈ సినిమా జనవరి పడిన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమాకు ఇచ్చిన తరహాలోనే జనవరి 12 న విడుదల కానున్న బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ కు కూడా బెనిఫిట్ షోస్ తో పాటు అదనపు రేట్లు ఇస్తారు అనే విషయం స్పష్టం అయింది. కొద్ది రోజుల క్రితమే గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సొంత నిర్మాణ సంస్థ నుంచే ఈ సంక్రాంతికి రెండు సినిమా లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో ఒకటి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అయితే, రెండవ సినిమా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ స్థాయిలో కాకపోయినా వెంకటేష్ సినిమా కు కూడా రేట్ల పెంపు ఉంటుంది అని తాజా పరిణామాలతో స్పష్టం అయింది. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇక నుంచి బెనిఫిట్ షో లతో పాటు అదనపు రేట్ల కు అనుమతి ఇచ్చేది లేదు అని ప్రకటించారు.

ఏడాది పాటు సినిమాలకు ఈ వెసులుబాటు కల్పించిన సీఎం రేవంత్ హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో రేవంత్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ను రేవంత్ రెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసినందున మరి ఆయన సినిమాలకు సీఎం రేవంత్ రెడ్డి అదనపు షో వెసులుబాటు అయినా ఇస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే. వాస్తవానికి బెనిఫిట్ షో లతో పాటు టికెట్ రేట్ల పెంపునకు నో చెప్పిన తెలంగాణ సర్కారు...అన్ని కొత్త సినిమాలకు ఒక షో అదనంగా వేసుకోవటానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది అని పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరిగింది. మొన్నటి మీటింగ్ లో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా సంక్రాంతి సినిమా విడుదల ముందు మాత్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెపుతున్నారు. బెనిఫిట్ షో ల రద్దు...టికెట్ రేట్ల పెంపుకు నో చెపుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి సామాన్య ప్రజలతో పాటు సినీ అభిమానుల నుంచి మంచి మంచి స్పందన వచ్చింది. దిల్ రాజు కోసం రేవంత్ రెడ్డి తన నిర్ణయంలో ఏమైనా మార్పులు చేస్తారో లేదో రాబోయే రోజుల్లో కానీ తేలదు. తెలంగాణ సర్కారు పై ఒత్తిడి కోసమే ఇంత ముందు జీవో ఇచ్చారా?!

Next Story
Share it