సుప్రీంకు చేరిన జల జగడం
రెండు తెలుగు రాష్ట్రాల్లో మాటల మంటలు రేపిన జల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. అకస్మాత్తుగా కృష్ణా జలాలకు సంబంధించిన వివాదం ఇటీవల తెరపైకి వచ్చింది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తొలుత ఈ అంశాన్ని లేవనెత్తగా..తర్వాత తెలంగాణ మంత్రులు మూకుమ్మడిగా ఏపీ సర్కారుపై దాడి ప్రారంభించారు. అయితే ఏపీ సర్కారు మాత్రం సీఎం కెసీఆర్ చర్చలకు రెడీ అంటే తాము కూడా చర్చలకు సిద్ధం అంటూ ప్రకటనలు చేసింది. అయినా తెలంగాణ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అకస్మాత్తుగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని...నీటి కేటాయింపులు ఎవరికి ఎంత అన్నది విభజన సమయంలోనే తేల్చారనే పలు పార్టీలు ప్రకటించాయి.
ఈ తరుణంలో ఏపీ సర్కారు కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని బుధవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధిని తక్షణమే నోటిఫై చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.అదే సమయంలో తెలంగాణ సర్కార్ జూన్ 28న ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరింది. ''తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది. విభజన చట్టాన్ని కూడా తెలంగాణ ఉల్లంఘిస్తోంది'' అని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.