Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు

ఏపీలో రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు
X

వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌కు సంబంధించి ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో విగ్ర‌హాల‌కు అనుమ‌తించ‌రాద‌ని..ఇళ్ల‌లోనే పూజ‌లు చేసుకునేలా చూడాల‌న్నారు. ఈ సారి నిమ‌జ్జ‌న ఊరేగింపులు వ‌ద్ద‌న్నారు. సీఎం జ‌గ‌న్ గురువారం నాడు క‌రోనా ప‌రిస్థితుల‌పై సమీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలోనే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. రాత్రి క‌ర్ఫ్యూను మ‌రికొంత కాలం పొడిగించాల‌ని నిర్ణ‌యించారు. గ‌తంలో లాగే రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటలవరూ కర్ఫ్యూ కొనసాగింపు అమల్లో ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన మందులు అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలని అధికారులకు తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కోవిడ్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకోవాలంటూ వస్తున్న సమాచారం నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై ఒక ఆలోచన కూడా చేయాలని అధికారులకు సూచించారు. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైన తర్వాత ఏ రకంగా అడుగులు ముందుకేయాలనే దానిపై సరైన ఆలోచనలు చేయాలన్నారు. నవంబర్‌ చివరి నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కనీసం సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ఇస్తామమని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తైన తర్వాత వైద్యులు లేరు, సిబ్బంది లేరనే మాటలు ఎక్కడా వినిపించకూడదని సీఎం జగన్‌ అన్నారు. బయోమెట్రిక్‌తో పక్కాగా హాజరు, పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందుల రాకూడదని సీఎం అధికారులను ఆదేశించారు.

Next Story
Share it