Telugu Gateway
Andhra Pradesh

కీలక విషయాల్లో హ్యాండ్ ఇచ్చినా..మోడీ కి జగన్ సర్కార్ సర్టిఫికెట్!

కీలక విషయాల్లో హ్యాండ్ ఇచ్చినా..మోడీ కి జగన్ సర్కార్ సర్టిఫికెట్!
X

ప్రధాని మోడీతో జగన్ హ్యాపీ, సీఎం జగన్ తో మోడీ హ్యాపీ. శనివారం నాడు విశాఖ లో జరిగిన కార్యక్రమం చూస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలగటం సహజం. కేంద్రంలోని మోడీ సర్కారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించలేదు. కడప స్టీల్ లేదు..మేజర్ పోర్ట్ ఊసు లేదు. ఎన్నో కీలక విభజన హామీల సంగతి సరే సరి. అయినా సరే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఒక ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చి మరి ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్ ప్రగతికి అండగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. శనివారం నాడు విశాఖ లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ, సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సమావేశంలోనే సీఎం జగన్ స్వయంగా మరోసారి పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలను ప్రస్తావించారు. కానీ మోడీ దగ్గర నుంచి వీటిపై ఎలాంటి స్పందన లేదు. విశాఖకే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ కు ఎంతో ప్రతిష్టాత్మకం అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా మోడీ ఎలాంటి హామీ ఇవ్వలేదు.

ఈ సమావేశంలో సీఎం జగన్ సంచలన వ్యాఖలు చేశారు. కేంద్రం తో తమ అనుబంధం రాజకీయాలకు అతీతం అన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరొకటి ఉండదన్నారు. పెద్ద మనసుతో మీరు చూపే ప్రేమ ప్రజలంతా గుర్తు పెట్టుకుంటారు అని జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ విషయం లో కేంద్రం చేయాల్సినవి చేయక పోయినా ఒక వైపు ప్రభుత్వం ఫుల్ పేజీ ప్రకటనలో మోడీ ఆంధ్ర ప్రదేశ్ కు అండగా నిలుస్తున్నారని చెప్పటం ఒకెత్తు అయితే..కేంద్రంతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతం అని ప్రకటించటం మరో కీలక ప్రకటనగా మారింది. విభజన వాళ్ళ నష్ట పోయిన ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేకంగా చేసింది ఏమి లేదనే విమర్శలు ఎప్పటి నుంచి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్ చెపుతున్నట్లు మరి నిజంగా మోడీ అండగా ఉంటే న్యాయబద్దంగా రావాల్సినవి కూడా ఆంధ్ర ప్రదేశ్ కు ఎందుకు రావటం లేదు అన్నది ఇప్పుడు కీలక ప్రశ్న.

Next Story
Share it