Telugu Gateway
Andhra Pradesh

మా ఎన్నిక‌ల‌తో మాకు సంబంధం లేదు

మా ఎన్నిక‌ల‌తో మాకు సంబంధం లేదు
X

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌ల వ్య‌వ‌హ‌రం రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీ బంధువు అయితే మా ఎన్నిక‌ల‌కు ఆయ‌న వ‌స్తారా? అంటూ మంచు విష్ణును ఉద్దేశించి ఈ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన‌ ప్ర‌కాష్ రాజ్ ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల్లో రాజ‌కీయాల‌ను ఎందుకు తెస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ త‌రుణంలో ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించ‌టం మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మా ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

మా ఎన్నికలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానీ, ఏపీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఏ వ్యక్తిని కాని, ఏ వర్గాన్ని కానీ సమర్థించడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ మంచు విష్ణు రెబెల్‌ స్టార్‌ కృష్ణం రాజును కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ..తనకు కృష్ణం రాజు ఆశీస్సులు ఉన్నాయంటూ ట్వీట్‌ చేశారు.ఇదిలా ఉంటే పెద్దల ఆశీర్వాదం తనకొద్దని, మా ఎన్నికల్లో తన సత్తాపైనే గెలుస్తానని ప్రకాశ్‌రాజ్ ప్ర‌క‌టించారు. పెద్దలను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో మా ఎన్నిక‌లు హాట్ హాట్ గా మారుతున్నాయి.

Next Story
Share it