ఏపీలో రాత్రి కర్ఫ్యూ సంక్రాంతి తర్వాతే
ఏపీ సర్కారు నిర్ణయం మార్చుకుంది. రాత్రి కర్ఫ్యూను వెంటనే కాకుండా సంక్రాంతి పండగ తర్వాత నుంచి అమలు చేయనుంది. పండగకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ అమల్లో ఉండనుంది. రాష్ట్రంలోకి పండగ కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే 100 రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ, ఇతర ప్రజా రవాణాలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. థియేటర్లలో మాత్రం 50 శాతం సామర్ధ్యానికే అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాల్స్ కోవిడ్ నిబంధనలు పాటించకపోతే మాత్రం భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు.