Telugu Gateway
Andhra Pradesh

విశాఖ స్టీల్ పై భరోసా కల్పించలేకపోతున్న సర్కారు

విశాఖ స్టీల్ పై భరోసా కల్పించలేకపోతున్న సర్కారు
X

రాష్ట్ర ప్రభుత్వం, బిజెపి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రజలకు భరోసా కల్పించలేకపోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాము బాధ్యత తీసుకుంటామని ఏ ఒక్క నేత ప్రకటించలేకపోతున్నారని తెలిపారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోతే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పోయినట్లే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి కూడా తయారవుతుందని అన్నారు. గంటా శ్రీనివాసరావు ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు విషయంలో రాజకీయ నేతలతోపాటు సినీ పరిశ్రమ, క్రీడా ప్రముఖులు అందరూ స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం ప్రతి పార్టీ ఏదో ఒక రీతిన పోరాటం చేస్తోందని, ఒక్క బీజేపీ మాత్రమే చేయడంలేదని విమర్శించారు. ఒకవైపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన ప్రకటన చేసినా.. మరోవైపు రాజ్యసభలో ఉక్కుమంత్రి స్పష్టంగా చెప్పినా.. ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని గంటా తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా పోరాడితేనే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోగలమని తెలిపారు. విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా ఉమ్మడిగా రాజీనామా చేస్తే పోరాటతీవ్రత కేంద్ర ప్రభుత్వానికి అర్ధం అవుతుందని తెలిపారు.

Next Story
Share it