ఆగమేఘాల మీద పరుగులు పెట్టిన ఫైల్స్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే సంపద సృష్టి గురించి చెపుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆయన స్లోగన్ కూడా. జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా కూడా తాను సంపద సృష్టించి పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా దీనిపైనే ఫోకస్ పెట్టారు. సంపద సృష్టి అంటే ప్రభుత్వ ఆస్తులను..ప్రజల సంపదను పెంచాలి. ఇందుకు అందుబాటులో ఉన్న వనరులను వాడుకోవాలి. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సంస్థలు , ప్రజల సంపద పెంచటం కంటే ప్రైవేట్ కంపెనీల సంపద పెంచటం...వాళ్లకు పెద్ద ఎత్తున ప్రయోజనం కల్పించే దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే చర్చ అధికార వర్గాల్లో ఉంది. ఈ విషయంలో ఆయన జగన్ కంటే చాలా దూకుడుగా ఉన్నారు అనే అభిప్రాయాన్ని కూడా కొంత మంది ఐఏఎస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జెన్ కో ) ను పక్కన పెట్టి వేల మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు జెన్ కో ఆసక్తిచూపించగా...ప్రభుత్వం దీన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రైవేట్ సంస్థలు అయిన నవయుగా ఇంజనీరింగ్, మేఘా ఇంజనీరింగ్ సంస్థలకు మాత్రం అనుమతులు మంజూరు చేసింది అని చెపుతున్నారు. నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా తొలి అవకాశం జెన్ కో కి ఇచ్చి ఉండేవాళ్ళు అని విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ప్రభుత్వ రంగ అంటే విద్యుత్ శాఖ కింద పని చేసే సంస్థలే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ లకు ఎక్కడెక్కడా అనువైన ప్రాంతాలు ఉన్నాయి అనే అంశాలను స్టడీ చేయటం తో పాటు నివేదికలకు కూడా సిద్ధం చేశాయి అని..అయితే వీటిని ప్రభుత్వానికి చెందిన జెన్ కో వంటి సంస్థలకు ఉపయోగ పడేలా వాడకుండా ప్రైవేట్ సంస్థలకు మేలు చేకూర్చేలా ఉపయోగించటం దారుణం అని ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. కొంత మంది ఉన్నతాధికారులు ఈ నివేదికలను కోట్ల రూపాయలు తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు చేరేలా చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ విషయంలో విద్యుత్ శాఖలోని కీలక స్థానాల్లో ఉన్న అధికారులు కూడా జెన్ కో వైపు కాకుండా ప్రైవేట్ సంస్థల వైపు మొగ్గుచూపినట్లు అధికార వర్గాలు చెపుతన్నాయి. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 2024 నవంబర్ 18 న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదనలు సమర్పిస్తే ఆ వెంటనే అంటే 2025 జనవరి 30 న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక బోర్డు (ఎస్ఐ పీబి) లో ఈ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపారు. అన్నమయ్య జిల్లాలో 2000 మెగావాట్ల సామర్థ్యంతో కొమ్మూరు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
విచిత్రం ఏమిటి అంటే నవయుగా ఇంజనీరింగ్ ఈ ప్రాజెక్ట్ కోసం 2024 డిసెంబర్ 16 న ప్రభుత్వానికి తన ప్రతిపాదనలు సమర్పించింది. ఈ కంపెనీ ప్రాజెక్ట్ కు కూడా అదే ఎస్ ఐ పీ బి లో ఆమోదం తెలిపారు. నవయుగా ఇంజనీరింగ్ కు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గుజ్జిలి వద్ద 1500 మెగావాట్లు, చిట్టంవలస దగ్గర 800 మెగావాట్ల ప్రాజెక్ట్ లకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం కలిపి ఈ కంపెనీ కి 2300 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ దక్కింది. మేఘా ఇంజనీరింగ్, నవయుగా ఇంజనీరింగ్ వంటి సంస్థలకు కలిపి ఏకంగా 4300 మెగావాట్ల ప్రాజెక్టులు కేటాయించారు కానీ..ఇదే విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్ కో ను విస్మరించటం అధికారులను కూడా విస్మయపరిచింది. దీని వెనక రకరకాల కారణాలు ఉన్నాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇవే కాదు సోలార్ తో పాటు ఇతర గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ల కేటాయింపుల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలే చెపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్లకు కూడా కొన్ని పవర్ ప్రాజెక్ట్ లు కేటాయించి మళ్ళీ వెంటనే వాటిని వేరే వాళ్లకు కేటాయించేలా కూడా ప్రభుత్వం ఓకే చెపుతుంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. నవయుగా, మేఘా ఇంజనీరింగ్ సంస్థలకు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ లు కేటాయించటమే కాకుండా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఈ ప్రైవేట్ సంస్థలు పలు రాయితీలు, ప్రోత్సహకాలు కూడా కల్పించబోతున్నారు. ఈ విషయంలో కూటమిలోని పార్టీ లు అన్ని కూడా ఒక అవగాహనా మేరకు కలిసి సాగుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.