ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కాలానికి సిద్ధం చేసిన తాత్కాలిక బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవలే కేబినెట్ ఆమోదించిన అనంతరం ఈ బడ్జెట్ ప్రతిపాదనలతో కూడిన ఆర్డినెన్స్ ను గవర్నర్ గ్రీన్ సిగ్నల్ లభించింది. గవర్నర్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలల కాలానికి గాను కేబినెట్ దీనిని ఆమోదించింది. సుమారు 90 వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదనలు పంపారు.
సహజంగా అయితే మార్చి 31లోపు అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ను పెట్టి ఆమోదింప చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏపీ సర్కారు పెండింగ్ లో ఉన్న జడ్పీటీసీ; ఎంపీటీసీ ఎన్నికలను పూర్తి చేసుకోవటంతోపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాల కోసం ఆర్డినెన్స్ తెచ్చినట్లు చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఆర్డినెన్స్ ద్వారా రెండవ సారి బడ్జెట్ ను ఆమోదింప చేసుకోవటం ఏ మాత్రం సరికాదని.. ఇది అసెంబ్లీ నుంచి పారిపోవటమే అని విమర్శలు గుప్పిస్తున్నాయి.