Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 'ఫ్రీ వ్యాక్సిన్'..సర్కారు కీలక నిర్ణయం

ఏపీలో ఫ్రీ వ్యాక్సిన్..సర్కారు కీలక నిర్ణయం
X

రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 18-45 సంవత్సరాల మధ్య వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో కోవిడ్ నియంత్రణ కోసం రాత్రి కర్ఫ్యూ కూడా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కర్ఫ్యూ రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ ఉండనుంది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వటానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీరందరికి ఏపీ సర్కార్‌ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనుంది. సీఎంతో భేటీ అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని మీడియాతో మాట్లాడారు. ''రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నాం. 18-45 వయసు ఉన్న వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేయటానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం.

కరోనా కట్టడి కోసం రేపటి నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ప్యూ అమల్లోకి రానుంది'' అని మంత్రి నాని తెలిపారు. ''సీటీ స్కాన్ పేరుమీద దోపిడీ చేయడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీనికి 2,500 రూపాయల ధర నిర్ణయించాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం. ఇది నిరంతరం జరుగుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దోపిడీకి పాల్పడవద్దని వినతి. మాస్క్, భౌతిక దూరం వంటి కోవిడ్‌ నియమాల అమలులో ప్రజలను భాగస్వామ్యం చేయమని సీఎం జగన్‌ సూచించారు. కళ్యాణ మండపాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని సీఎం ఆదేశించారన్నారు.

Next Story
Share it