Telugu Gateway
Andhra Pradesh

దేవాలయాల భూములు కూడా కంపెనీకి

దేవాలయాల  భూములు కూడా కంపెనీకి
X

మై హోమ్ ఇండస్ట్రీస్ ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాన్ కు సర్కారు భారీ రాయితీలు ప్రకటించింది. కంపెనీ మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంటే ఈ సంస్థకు ప్రభుత్వం మూలధన రాయితీ తో పాటు విద్యుత్ చార్జీల సబ్సిడీ కిందే గరిష్ఠంగా రూ.1,129.36 కోట్ల మేర ప్రోత్సాహకాలను మంజూరు చేయనుంది. శుక్రవారం నాడు జారీ చేసిన జీవోలో ఈ విషయాలు పేర్కొన్నారు. ప్రతిపాదిత యూనిట్ ద్వారా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి అని చెపుతున్నారు. . స్థిర మూలధన పెట్టుబడిలో 43.48 శాతం వరకు ప్రోత్సాహకాలు దక్కనున్నాయి. దీనికి గాను కంపెనీ 2029 మార్చి యూనిట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ లోపు స్థిర మూలధన పెట్టుబడి (FCI) రూ.2,597 కోట్ల రూపాయలతో ప్లాంట్ పూర్తి చేయాలనే షరతుతో ఈ రాయితీలు కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం (4.0) 2024–29’ కింద స్థిర మూలధన పెట్టుబడిలో 43.48 శాతం వరకు, గరిష్ఠంగా రూ.1,129.36 కోట్ల మేర ప్రోత్సాహకాలను మంజూరు చేయనున్నట్లు జీవో లో వెల్లడించారు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అర్హత కలిగిన స్థిర మూలధన పెట్టుబడి (eFCI)లో 39 శాతం మేర, గరిష్ఠంగా రూ.943.02 కోట్ల మూలధన రాయితీని మంజూరు చేస్తారు. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన తేదీ (DCP) నుంచి పదేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని విడతలవారీగా చెల్లిస్తారు. విద్యుత్ ఛార్జీల రీయింబర్స్‌మెంట్ విషయానికి వస్తే విద్యుత్ పంపిణీ సంస్థల (DISCOM) నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌పై యూనిట్‌కు రూ.1 చొప్పున, వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన తేదీ నుంచి పదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలను తిరిగి చెల్లిస్తారు. ఈ రాయితీ గరిష్ఠ పరిమితి రూ.186.34 కోట్లుగా ఉంటుంది. దీంతో పాటు మై హోమ్ ఇండస్ట్రీస్ మరో వెసులుబాటు కూడా కల్పించారు. మార్చి 2029 నాటికి హామీ ఇచ్చిన మేరకు 2,000 మందికి ఉపాధి కల్పిస్తే మూలధన రాయితీ కింద స్థిర మూలధన పెట్టుబడిలో అదనంగా 2 శాతం (అర్హత కలిగిన స్థిర మూలధన పెట్టుబడిలో 2.15 శాతానికి సమానం) ప్రోత్సాహకం పొందేందుకు కంపెనీ అర్హత సాధిస్తుంది అని పేర్కొన్నారు.

అయితే ఈ అదనపు ప్రోత్సాహకం వర్తించే విధాన మార్గదర్శకాలకు అనుగుణంగా, సంబంధిత అధికారి ధ్రువీకరణకు లోబడి ఇది మంజూరు చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రతిపాదిత సిమెంట్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కంపెనీకి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ద్వారా, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వాస్తవ వ్యయం ఆధారంగా 27.19 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో జాతీయ రహదారితో అనుసంధానం, బెల్ట్ కన్వేయర్ సదుపాయాలు, సౌర విద్యుత్ ప్లాంట్ కోసం 21.13 ఎకరాలు, ప్రాజెక్టు పరిధిలో ఉన్న మరో 6.06 ఎకరాల భూమి ఉన్నాయి. వీటితో పాటు ప్రతిపాదిత మైనింగ్ ప్రాంతంలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయం, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాలకు చెందిన భూముల బదలాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ భూములను మార్కెట్ విలువతోపాటు ఇతర ఛార్జీలను చెల్లించి సేకరించేందుకు అనుమతించడం లేదా వాటికి బదులుగా తగిన ప్రత్యామ్నాయ భూములను కేటాయించడం ద్వారా బదలాయింపు చేపట్టాల్సి ఉంటుంది అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూమిని గుర్తించే విషయంలో స్థానిక ప్రజల సమ్మతిని తప్పనిసరిగా తీసుకోవాలని, పరస్పర అంగీకారంతో నిర్ణయించిన నిబంధనల ఆధారంగానే ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేసేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

Next Story
Share it