అసెంబ్లీ వేదికగా పయ్యావుల సంచలన వ్యాఖ్యలు
పయ్యావుల కేశవ్. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి. బడ్జెట్ పై ఆయన శాసనసభలో ఇటీవల సుదీర్ఘ ప్రసంగాలు అయితే చేశారు. వాటిలో బడ్జెట్ గురించి తక్కువ... ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తలు ఎక్కువ అన్న చందంగా సాగింది పయ్యావుల కేశవ్ స్పీచ్. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పయ్యావుల కేశవ్ ఇదే మోడల్ ఫాలో అవుతూ వస్తున్నారు. అది కలెక్టర్ల సమావేశం అయినా...బడ్జెట్ సమావేశాలు అయినా సరే ఆయన అదే పనిలో ఉన్నారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా కేశవ్ ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై కూడా ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఈ ప్రసంగ ఫ్లో లో పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే వీటిని ప్రధాన మీడియా గుర్తించకుండా వదిలేసిందా...లేక కూటమి పార్టీలకు ఇబ్బంది అని వదిలేసిందో తెలియదు కానీ....పయ్యావుల కేశవ్ నాటకీయ ధోరణిలో పొగడ్తలు కురిపిస్తూ దారుణ వ్యాఖ్యలు చేశారు.
అవేంటి అంటే ‘నేను పదే పదే చెపుతున్నా అధ్యక్షా. ఇది రాజకీయ ప్రయోజనాల కోసమో..స్వార్ధం కోసం కలిసింది కాబట్టే ఈ బంధం అంత దృడంగా ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా’ అంటూ కేశవ్ కామెంట్ చేశారు. టీడీపీ, జనసేన బంధం గురించి చెపుతూ ఆయన ఈ మాటలు అన్నారు. అంతకు ముందు మాత్రం రాష్ట్ర భవిష్యత్ కోసం కలిశారు కాబట్టే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య బంధం అంత దృడంగా ఉంది అని చెప్పారు. కూటమి బంధాన్ని చూసి డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేలు కుళ్ళు కుంటున్నారు...కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అంటూ వైసీపీ ఎమ్మెల్యేల గురించి వ్యాఖ్యానించారు. కూటమిలో చీలికలు ఎలా తేవాలా అని సోషల్ మీడియా వేదికగా కుట్రలు చేస్తున్నారు అని ఆరోపించారు. రాజకీయ అవసరాలు..స్వార్ధం కోసం కలిసిన వ్యక్తులు కాదు వీళ్ళు అంటూ చెప్పుకొచ్చారు ముందు. తర్వాత ఒక్క దెబ్బకు బాంబు వేసినట్లు వేశారు కేశవ్ తన మాటలతో. పయ్యావుల కేశవ్ రాజకీయ ప్రయోజనాలు..స్వార్ధం కలిసిందే కూటమి అంటూ చేసిన వ్యాఖ్యలు చూసి ఎమ్మెల్యేలు కూడా అవాక్కు అయ్యారు.