Telugu Gateway
Andhra Pradesh

సీఎంఓ కు ఆర్థిక శాఖ అధికారుల ఫిర్యాదు?!

సీఎంఓ కు ఆర్థిక శాఖ అధికారుల ఫిర్యాదు?!
X

ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్...ఆ శాఖ ఉన్నతాధికారుల మధ్య ఏ మాత్రం సయోధ్య ఉన్నట్లు కనిపించటం లేదు. కొద్ది రోజుల క్రితం మంత్రి పయ్యావుల కేశవ్ తనకు తెలియకుండా వైసీపీ సానుభూతిపరులు...వైసీపీ కి చెందిన కాంట్రాక్టర్లకు బిల్స్ ఎలా చెల్లించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. ఇవే కాదు...వాస్తవానికి జనవరి లో పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన నిర్వాసితులకు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించిన విషయం కూడా ఆర్థిక మంత్రి కేశవ్ కు చాలా ఆలస్యంగా తెలిసింది అంటూ అధికార వర్గాల్లో ప్రచారం లో ఉంది. పలు విషయాల్లో మంత్రికి..అధికారులకు మధ్య గ్యాప్ బాగా ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ తరుణంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంత్రి పయ్యావుల పేషీ లో ప్రైవేట్ వ్యక్తులు తరచూ ఉండటం పై సీఎంఓ కు ఫిర్యాదు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

అత్యంత కీలక మైన బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు కూడా అంటే శుక్రవారం నాడు మంత్రి ఛాంబర్ లో జరిగిన ఉన్నతాదికారుల సమావేశంలో కూడా వై. సాయిబాబా కూర్చోవటంపై ఆర్థిక శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు అని..మంత్రి పయ్యావుల కేశవ్ కు...సాయి బాబాకు ఏదైనా లావాదేవీలు ఉంటే బయట చూసుకోవాలి కానీ..ఇలా బడ్జెట్ వంటి కీలక సమావేశం రోజు కూడా అధికారుల మీటింగ్ లో ప్రైవేట్ వ్యక్తులకు కూర్చోబెట్టడం ఏ మాత్రం సరికాదు అని ఆర్థిక శాఖ అధికారులు అందులో పేర్కొన్నట్లు చెపుతున్నారు.

ఇదే కాకుండా ఆర్థిక శాఖ సమావేశాల్లో కూడా ఆయన అప్పుడప్పుడు అధికారికంగా పాల్గొంటున్నట్లు కొంత మంది అధికారులు చెపుతున్నారు. సాయి బాబా గత టీడీపీ ప్రభుత్వంలో 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ గా పని చేశారు. ఇప్పుడు ఎలాంటి పదవి లేదు. కానీ ఆర్థిక శాఖ వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఒక్క సాయిబాబానే కాకుండా మరి కొంత ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆర్థిక శాఖ లో హంగామా చేస్తున్నారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. మరి వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తారా లేదా అన్నది వేచిచూడాలి. మంత్రి పయ్యావుల కేశవ్ కు, సాయిబాబా కు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం టీడీపీ నేతలకు తెలుసు.

Next Story
Share it