ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్
కీలక పరిణామం. ఏపీకి చెందిన మాజీ మంత్రి, తెలుగుదేశం నేత పి. నారాయణను ఏపీసీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో నారాయణ విద్యాసంస్థల పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కూడా ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ నారాయణ, చైతన్యల పేర్లను స్వయంగా ప్రస్తావించారు. వీరే లీక్ చేసి..వీరే కావాలని గొడవ చేస్తారంటూ తెలుగుదేశం నాయకులనుద్దేశించి విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సీఐడీ పోలీసులు హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న నారాయణను అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ నోటి నుంచి నారాయణ విద్యాసంస్థల పేరు వచ్చిన కొద్ది రోజుల్లోనే నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి అమరావతి భూముల విషయంలో కూడా ఆయనపైన తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఏపీసీఐడీ చంద్రబాబుతోపాటు నారాయణపై కూడా కేసులు నమోదు చేయగా..కోర్టు నుంచి ఊరట పొందారు. ఇప్పుడు ఆకస్మికంగా పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీక్ లో అరెస్ట్ అయ్యారు.