'చలో విజయవాడ' సక్సెస్
ఏపీ సర్కారు కొత్తగా జారీ చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయింది. సర్కారు ఎన్ని అడ్డంకులు కల్పించినా..పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టినా సరే వేల సంఖ్యలో ఉద్యోగులు దీనికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బుధవారం నాడే విజయవాడకు వచ్చే నాలుగు మార్గాల్లోనూ తనిఖీలు పెట్టినా..ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయవద్దని కలెక్టర్లకు అనధికారిక ఆదేశాలు వెళ్లినా అవేమీ పనిచేయలేదు. భారీ సంఖ్యలో హాజరైన ఉద్యోగులతో సర్కారు ఒకింత ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి చలో విజయవాడ అంటే ..ఇది ప్రభుత్వం ముందు బలప్రదర్శన చేయటం వంటిదే అని..ఇది మంచి పద్దతి కాదన్నారు. అయినా సరే ఉద్యోగులు ఇవేమీ పట్టించుకోకుండా భారీ ఎత్తున విజయవాడకు తరలివచ్చారు. ఉద్యోగ సంఘం నేతలు పీఆర్సీ జీవోల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకూ ఉద్యమాన్ని ఆపేదిలేదని ప్రకటించారు.
అదే సమయంలో సమ్మె కూడా తప్పదన్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే అని తెలిపారు. చలో విజయవాడలో పాల్గొన్న ఉద్యోగులు అందరూ అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దు చేయాలని..తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వేలాది మంది తరలిరావటంతో పోలీసులు వారిని నియంత్రించలేకపోయారు. పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించిన ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. వీటితోపాటు ఎర్ర జెండాలు పట్టుకుని పీఆర్సీకి వ్యతిరేకంగా నిదాదాలు చేశారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదని, తమను తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ గతంలో చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే ఉద్యోగులను రోడ్ల మీదకు తెచ్చారని ఆరోపించారు. పలు మార్గాల్లో విజయవాడకు చేరుకుంటున్న ఉద్యోగులను పలు చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ తలపెట్టిన బీఆర్ టీఎస్ రోడ్డులో వేలాది మంది వచ్చి చేరారు.