Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ, జనసేన లెక్కలు తేలిపోయినట్లేనా!

టీడీపీ, జనసేన లెక్కలు తేలిపోయినట్లేనా!
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరకు వస్తుండటంతో రాజకీయ పార్టీలు అన్నీ వేగం పెంచాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని టీడీపీ, జనసేనలు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. బయటకు చెప్పక పోయినా ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సంఖ్య విషయంలో ఒక అవగాహన వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం జనసేనకు తెలుగు దేశం పార్టీ 25 అసెంబ్లీ సీట్ల తో పాటు రెండు ఎంపీ సీట్లు కూడా ఇవ్వనుంది. అయితే జనసేన మరో మూడవ ఎంపీ సీటు కోరుతున్నట్లు చెపుతున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం తెలుగు దేశం పార్టీ జనసేన కు అనకాపల్లి, కాకినాడ లోక్ సభ స్థానాలు కేటాయించటానికి అంగీకారం తెలిపినట్లు చెపుతున్నారు. ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే ఎక్కువ సీట్లు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని సీట్లు జనసేన కోరుతున్నట్లు సమాచారం. సీట్ల విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూసుకునేందుకు రెండు పార్టీలు అంతర్గతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నాయకులతో వరస సమావేశాలు పెడుతూ ఎక్కడెక్కడ తమకు బలమైన అభ్యర్థులు ఉన్నారు...గెలుపు అవకాశాలు వంటి వాటి విషయంప ఫోకస్ పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికలకు కూడా వచ్చే జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారములు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నా నేపథ్యంలో పార్టీ లు అన్నీ కూడా అభ్యర్థుల ఖరారు కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే అభ్యర్థుల మార్పునకు సంబంధించి కసరత్తు దాదాపు పూర్తి చేశారు. వచ్చే నెలలోనే ఒకే సారి వైసీపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అని చెపుతున్నారు.

Next Story
Share it