పవన్ ఎప్పుడు ‘హోమ్ ను’ టచ్ చేసినా రచ్చే!

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు హోమ్ శాఖ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా అది రచ్చ రచ్చ కావటం సాధారణం అన్నట్లు తయారు అయింది పరిస్థితి. గతంలో ఒకసారి ఆయన బహిరంగ సభలోనే ఇలాగైతే తాను హోమ్ శాఖను తీసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. విచిత్రం ఏమిటి అంటే ఆయనకు ఒక్క హోమ్ శాఖలో తప్ప మరెక్కడా కూడా సమస్యలు ఉన్నట్లు కనిపించవా అన్న ప్రశ్న కూడా తెర మీదకు వస్తోంది. లేదు అంటే సెలెక్టివ్ అంశాలపైనే కావాలనే స్పందిస్తున్నారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆయన కార్యాలయం అధికారికంగా తెలిపింది. ముఖ్యంగా డీఎస్పీ పేకాట క్లబ్ లు...సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై జిల్లా ఎస్పీ తో మాట్లాడి ఇదే అంశంపై నివేదికను పంపాలని ఆదేశించారు.
వచ్చిన నివేదికను హోమ్ మంత్రి, డీజీపీ లకు పంపాలని తన పేషీ అధికారులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఇదే పెద్ద దుమారం రేపగా ఈ అంశంపై తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలిసినంత వరకు భీమవరం డీఎస్పీ జయరాజు మంచి అధికారి అన్నారు. ఆయన ట్రాక్ రికార్డు కూడా బాగానే ఉంది అని తెలిపారు. పవన్ కళ్యాణ్ తన శాఖతో పాటు ఇతర శాఖల విషయంలో కూడా జోక్యం చేసుకోవటం మంచిదే అన్నారు. అయినా కూడా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం 13 ముక్కల పేకాట నేరం కాదు అన్నారు. అదే సమయంలో తాను పేకాటను సమర్ధించటం లేదు అని...గత కొంత కాలంగా పేకాట క్లబ్ లపై ఉక్కుపాదం మోపినట్లు చెప్పారు.
బహుశా ఇదే కారణంతో కొంత మంది ఫిర్యాదు చేసి ఉండొచ్చు తెలిపారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం పోస్టింగ్ విషయంలో వివాదాలే ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చాయనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఈ వివాదంపై ఇటీవల స్పందించిన హోమ్ మంత్రి అనిత భీమవరం డీఎస్పీ విషయంలో తమ దగ్గర కూడా నివేదిక ఉంది అని చెప్పారు. నిజంగా హోమ్ మంత్రి చెప్పింది...పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం అయితే నివేదిక ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోకుండా వదిలేశారు అనే ప్రశ్న ఉదయించకమానదు. హోమ్ మంత్రి అనిత చెప్పినట్లు నివేదిక ఉండి కూడా వదిలేసి...ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విషయాన్నీ బయటకు తెచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వ పరువు పోదా అని టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు.



