Telugu Gateway
Andhra Pradesh

సభకు దూరంగా పవన్..కారణాలు ఏంటో?!

సభకు దూరంగా పవన్..కారణాలు ఏంటో?!
X

ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే తక్కువ రోజులు. కాస్తో కూస్తో కాస్త సమావేశాలు ఎక్కువ రోజులు ఉండేది బడ్జెట్ సెషన్స్ లోనే. కానీ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం గత కొన్ని రోజులుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని రోజులు సభకు వచ్చిన అయన గత కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం లేదు. అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు చూసే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సమావేశాలకు డుమ్మా కొట్టడం టీడీపీ ఎమ్మెల్యేల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు...పవన్ కళ్యాణ్ చూసే శాఖలకు సంబంధించిన ప్రశ్నలు అన్నింటిని మార్చి 18 వరకు వాయిదా వేసినట్లు టీడీపీ ఎమ్మెల్యేలు చెపుతున్నారు. దీని వెనక ఉన్న కారణం ఏంటో కూడా తెలియదు అంటున్నారు.

అత్యవసరం అయితే తప్ప అసలు మంత్రులు శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టరు . తీవ్రమైన అనారోగ్యం...లేక పోతే ఇతర తప్పనిసరి అధికారిక కార్యక్రమాలు ఉంటే తప్ప ఇలాంటివి జరగవు. కానీ జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కు దూరంగా ఉండే విషయం లో స్పీకర్ కు సమాచారం ఇచ్చారో లేదో తెలియదు కానీ ఆయన గత కొన్ని రోజులుగా సమావేశాలకు డుమ్మా కొట్టడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఒక వైపు ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా..ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశానికి మాత్రం హాజరు అయ్యారు. దీంతో పాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన లో చేరిక కార్యక్రమంలో మాత్రం పాల్గొన్నారు. అత్యంత కీలకమైన శాఖ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన మంత్రి...అది కూడా ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభకు దూరంగా ఉంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఏమి మాట్లాడే పరిస్థితి లేదు. ఇంత కీలక శాఖ చూసే టీడీపీ మంత్రి ఎవరైనా ఇలా చేయగలరా..చేస్తే చంద్రబాబు ఇలాగే మౌనంగా ఉంటారా అని ఒక టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇతర క్యాబినెట్ మంత్రులతో పోలిస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సచివాలయానికి వచ్చి ఆఫీస్ లో ఉండేది తక్కువ.

ప్రజలను కలుసుకునేది కూడా తక్కువే అని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. అంతే కాకుండా ఇప్పుడు ఏకంగా రోజుల తరబడి అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా డుమ్మాకొట్టడం ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతుంది అన్న చర్చ సాగుతోంది. మార్చి 14 న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభకు హాజరు కానున్నారు. ఈ సభ ఏర్పాట్ల కోసం ఇప్పుడు మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అక్కడే ఉంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ శాఖలో జరిగిన గ్రామీణ నీటిసరఫరా టెండర్ల లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అనే ఆరోపణలు వచ్చాయి. ముందే నిర్ణయించిన కంపెనీలకు వేల కోట్ల రూపాయల పనులు కట్టబెట్టినట్లు ఆ శాఖ వర్గాల్లో కూడా ప్రచారం లో ఉంది.

Next Story
Share it