Telugu Gateway
Andhra Pradesh

జనసేన అధినేత వాళ్ళను టార్గెట్ చేశారా?!

జనసేన అధినేత వాళ్ళను టార్గెట్ చేశారా?!
X

తిరుపతి దుర్ఘటన విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహారం కలకలం రేపుతోంది. గురువారం నాడు ఆయన తిరుపతిలో ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి తర్వాత తప్పు జరిగింది అని..ప్రభుత్వం తరపున క్షమాపణ చెపుతున్నట్లు ప్రకటించారు. ‘నాకు నిన్న కన్నీళ్లు వచ్చాయి..కరిగిపోయాను నేను. వీళ్లకు క్షమాపణ చెప్పకపోతే ఎవరికి చెపుతాం. ఏఈఓ వెంకయ్య చౌదరి కానీ...ఈఓ శ్యామలరావు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు కానీ, టీటీడీ పాలకమండలి బోర్డు సభ్యులు అందరూ కానీ మీరు అంతా వచ్చి ఒక్కొక్క వ్యక్తి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్ధం అవుతుంది. క్షమాపణ చెప్పండి. మీరు క్షమాపణ చెప్పి తీరాలి. వేరే దారి లేదు ’ అంటూ వ్యాఖ్యానించారు.

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు అంటే అది ప్రభుత్వం తరపున చెప్పినట్లే లెక్క. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయాన్ని కావాలని పొడిగిస్తున్నట్లు ఉంది అనే చర్చ సాగుతోంది. శుక్రవారం నాడు సొంత నియోజకవర్గం పిఠాపురం లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ క్షమాపణ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు టీటీడీ బోర్డు సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన క్షమాపణ అంశం గురించి మీడియా ప్రతినిధులు చైర్మన్ బి ఆర్ నాయుడును ప్రశ్నించగా....క్షమాపణ చెప్పటంలో తప్పులేదు. కానీ క్షమాపణ చెప్పినంత మాత్రాన చనిపోయినవారు తిరిగిరారు. తప్పిదం జరిగింది. ఇందుకు కారణం అయిన వాళ్ళను కఠినంగా శిక్షిస్తాం. ఎవరో ఏదో డిమాండ్ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమన్హత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించారు అని నాయుడు గుర్తు చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం అని తెలిపారు.

Next Story
Share it