నాగబాబు చేతుల మీదుగా శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిజంగా అంత బిజీ గా ఉన్నారా?. తన సొంత నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో కూడా పాల్గొనలేనంత స్థాయిలో ఏమి పనులు చేస్తున్నారో అన్న చర్చ సాగుతోంది . దీనికి ప్రధాన కారణం జనసేన గురువారం నాడు విడుదల చేసిన ప్రకటనే. ఆ ప్రకటన సారాంశం ఇలా ఉంది. ‘శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు ఈ నెల 4, 5 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు.పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను నాగబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమాల్లో శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ , టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్ గారు, పిఠాపురం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ కూడా హాజరు కానున్నారు.’ అంటూ అధికారికంగా తెలిపారు. సహజంగా ఇలాంటి కార్యక్రమాల్లో మంత్రులే నేరుగా పాల్గొంటారు. ఇది రాజకీయంగా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్న ...ఇటీవల ఎమ్మెల్సీ గా ఎన్నికైన నాగబాబు కు ఈ బాధ్యతలు అప్పగించటం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత నెలలో పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపిన విషయం తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచారు అంటే ఇందులో నియోజకవర్గ ప్రజలు...జనసైనికులే ప్రధాన కారణం అని...కాదు తమ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ ఖర్మ అంటూ పవన్ కళ్యాణ్ కోసం సీటు వదులుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నుద్దేశించి మాట్లాడిన సంగతి తెలిసిందే.