Telugu Gateway
Andhra Pradesh

రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు

రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు ఇప్పుడు అటు రాజకీయ వర్గాలతో పాటు సినీ పరిశ్రమలో కూడా హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ కు చెందిన కొంత మంది హరి హర వీర మల్లు సినిమా సినిమా విడుదల సమయంలో ఏవో కారణాలు చెప్పి సింగిల్ థియేటర్లు జూన్ ఒకటి నుంచి మూసివేయాలని నిర్ణయం తీసుకోవటంపై అటు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు చాలా మందిని అవాక్కు చేసింది. టాలీవుడ్ కు చెందిన పెద్దలు ఎవరూ ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఇప్పటి వరకు మర్యాద పూర్వకంగా కలవలేదు అనే విషయం పవన్ కళ్యాణ్ కు ఈ వివాదం తలెత్తే వరకు పవన్ కళ్యాణ్ కు ఎందుకు గుర్తుకు రాలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏ సినిమా నిర్మాత అడిగినా బడ్జెట్ తో సంబంధం లేకుండా కూడా రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇస్తూ..ప్రేక్షకులపై భారం మోపటానికే రెడీ అవుతోంది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో టాలీవుడ్ కు చెందిన ఎవరు అంత దైర్యంగా ఆయన సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా ఉన్న దిల్ రాజు..మరో వైపు తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. మరో వైపు రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్లు కలిగి ఉన్న అల్లు అరవింద్ ఇందులో ఏమైనా ఉన్నారా అనే అనుమానాలు పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొంత కాలంగా అటు మెగా ఫ్యామిలీ..అల్లు ఫామిలీ ల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అందుకే కొంత మంది అల్లు అరవింద్ వైపు ఈ విషయంలో అనుమానంగా చూస్తున్నారు అని చెపుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడ అధికారిక సమాచారం లేదు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ విడుదల చేసిన ప్రకటన చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసేదిలా ఉంది అనే చెప్పాలి.

డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి. ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే – తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించినా సానుకూలంగా స్పందించలేదు.

తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాల్జేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి. రూ.కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాము.

గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చెప్పిన విధంగానే- కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందినవారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం.

తెలుగు సినిమా రంగంవారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కల్యాణ్ సూచించారు. దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, శ్రీమతి వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్ కల్యాణ్ గారికి తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచన చేశారు. దీనిపై గౌరవ ముఖ్యమంత్రి తో చర్చించనున్నారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు.’ అని తెలిపారు.

Next Story
Share it