ఆ నెట్ వర్క్ ఇప్పుడు పని చేయటం లేదా?!
జనసేనలో మారాల్సింది ఎవరు?. ఆ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేసిన బహిరంగ లేఖతో ఆ పార్టీ నేతల్లో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేతే పలు మార్లు వివాదాలకు కారణం అయ్యారు. లోపల మాట్లాడాల్సిన మాటలు బయట..బయట మాట్లాడాల్సిన విషయాలు లోపల అన్న చందంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ హెచ్చుతగ్గులు (ఫ్లక్ట్చుయేషన్స్) చూపిస్తారో అర్ధం కాకుండా ఉంది అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. బహిరంగం గా హోమ్ మంత్రి అంశంపై మాట్లాడటం ఒకటి అయితే...తిరుపతి లో జరిగిన దుర్ఘటన సమయంలో అసలు ముఖ్యమంత్రి తో సంబంధం లేకుండా ఉప ముఖ్యమంత్రి గా ఉన్న పవన్ కళ్యాణ్ నేరుగా క్షమాపణ చెప్పటం మరొకటి . టీటీడీ అధికారులు అయినా..మరొకరు అయినా కచ్చితంగా ఈ విషయంలో తప్పు జరిగింది ప్రభుత్వం తరపునే. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ఉప ముఖ్యమంత్రిగా..సాంకేతికంగా ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు అంటే అది ప్రభుత్వం తరపున చెప్పినట్లే లెక్క. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోక పోతే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు అనే ఫీలింగ్ ప్రజలకు కలిగించారు. బియ్యం అక్రమ రవాణా విషయంలో కాకినాడ ఎమ్మెల్యే పై బహిరంగంగా విమర్శించింది కూడా పవన్ కళ్యాణే. ఇలా పవన్ కళ్యాణ్ స్వయంగా తానే ఎన్నో సార్లు విపక్షాలకు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా పార్టీ నాయకులు...క్యాడర్ కు బహిరంగ లేఖ రాశారు. ఎవరూ కూడా కూటమి అంతర్గత అంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చవద్దు అంటూ లేఖ రాశారు. మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాలి అంటూ చెప్పారు. ఈ లేఖలో పవన్ కళ్యాణ్ ఒక్క విషయం మాత్రం వంద శాతం వాస్తవం చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి ఘన విజయం వెనక మూడు పార్టీల బలమే కాకుండా...జగన్ ఐదేళ్ల పాలన కూడా కీలక పాత్ర పోషించింది అనే విషయం.
కానీ అటు టీడీపీ, ఇటు జనసేనలు మాత్రం ఎవరికి వారు తమ తమ బలం కారణంగానే ప్రజలు తమకు ఓట్లు వేసినట్లు ఫీల్ అవుతూ వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. మూడు పార్టీల కలయిక కూటమికి 50 శాతం బలం అయితే...జగన్ వద్దు అనుకుని ఓటు వేసిన వాళ్ళు కూడా అంతే శాతం ఉంటారు అని ఒక కీలక నేత వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కూటమిలో జరిగే గోల్ మాల్ వ్యవహారాలు..అవినీతి డీల్స్ గురించి నోరెత్తకుండా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తనకున్న నెట్ వర్క్ తో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవటం కష్టం కాదు అని చెప్పిన అయన...అధికారంలో ఉండి కూడా ఇప్పుడు తన నెట్ వర్క్ తో ఏమి తెలుసుకోలేక పోతున్నారా...లేక తన వాటాలు తనకు వస్తున్నాయి అనే ఉద్దేశంతో మౌనాన్ని ఆశ్రయిస్తున్నారో అర్ధం కావటం లేదు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. అందరూ కలిసి పాలనపై ఫోకస్ పెట్టాల్సిన సమయంలో ఎవరి వ్యవహారాలు వాళ్ళవి అన్న చందంగా కూటమి పార్టీలు వ్యవహరిస్తున్నాయి అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది.