Telugu Gateway
Andhra Pradesh

పవన్ ప్రకటనలతో ఇరకాటంలో కూటమి!

పవన్ ప్రకటనలతో ఇరకాటంలో కూటమి!
X

పవర్ లో ఉన్న వాళ్ళ ప్రతి కదలికను అందరూ జాగ్రత్తగ్గా చూస్తూ ఉంటారు. అందులో సినిమా హీరోగా పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో జనసేన దేశంలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కానీ రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ సీట్లను గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించింది. భవిష్యత్ లో ఈ రికార్డు ను బ్రేక్ చేయటం కూడా అంత ఈజీ కాదు అనే విషయం తెలిసిందే. ఈ గెలుపు వెనక కారణాలు ఏంటి అనే కంటే...ఈ రికార్డు అన్నది ఒక చరిత్ర. అయితే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం నుంచి పవర్ లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కన్ఫ్యూజన్ పోయినట్లు లేదు అనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన ప్రతి మూమెంట్ కూడా కీలకం అనే విషయం తెలిసిందే. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనూ..సమీక్ష సమావేశాల్లో పవన్ కళ్యాణ్ కూర్చునే విధానం అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆయన అసెంబ్లీ లో ఒక డిప్యూటీ సీఎం హోదా ఉన్న వ్యక్తిగా కాకుండా చాలా రిలాక్స్ గా ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో కూర్చున్నట్లు కూర్చున్నారు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

కొన్ని సార్లు సమీక్షా సమావేశాల్లో కూడా అలాగే ఉంటుంది తెలిపారు. ఇది ఒక అంశం అయితే జూన్ ఐదున తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటాను అని...ఎందుకంటే ప్రజల సొమ్ము తింటున్నాను అనే బాధ్యత ప్రతి క్షణం గుర్తు ఉంటుంది కాబట్టి..అప్పుడు తాను పని చేయకపోతే ప్రజలు తనను ప్రశ్నించవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. కానీ సడెన్ గా ఆయన ఇప్పుడు రాష్ట్రం, పంచాయతీరాజ్ శాఖకు అప్పులు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు అని..అందుకే తాను జీతం తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు తెలియటం ఏంటి?. ఎన్నికల ప్రచారంలో అటు చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం పదే పదే చెప్పారు కదా. అయినా కూడా నెల రోజులు కూడా గడవక ముందే పవన్ కళ్యాణ్ తన జీతం విషయంలో ఇలా గందరగోళ ప్రకటనలు చేయటం చూసి అందరూ అవాక్కు అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరు జీతం తీసుకోకపోతే రాష్ట్రం అప్పులు అన్ని తీరిపోతాయా?.

ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి...ఇలా గందరగోళ ప్రకటనలు చేయటం వల్ల రేపు పవన్ కళ్యాణ్ జీతం తీసుకోకుండా పని చేస్తుంటే చంద్రబాబు, నారా లోకేష్ తో ఇతర మంత్రులు అందరూ మాత్రం జీతం తీసుకుంటున్నారు అనే విమర్శలు రావా?. పవన్ కళ్యాణ్ తన నిర్ణయాలతో కూటమిని ఇరకాటంలో పెట్టాలనుకుంటారా...లేక మేలు చేస్తున్నారో అర్ధం కావటం లేదు అనే చర్చ సాగుతోంది. మరో కీలక విషయం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ జనసేన కు చెందిన ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, బొమ్మిడి నాయకర్ లకు విప్ పదవులు ఇవ్వాలని కోరుతూ తాజాగా చంద్రబాబు కు లేఖ రాశారు. ఈ విషయాన్ని మీడియా కు కూడా విడుదల చేశారు. విప్ ల పదవుల విషయంలో అయినా..ఏ విషయంలో అయినా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మాట్లాడి తీసుకోవటం తప్పు కాదని..ఇలాంటి వాటి విషయంలో బహిరంగంగా లేఖలు రాసి వాటిని మీడియాకు విడుదల చేయటం సరైన పద్ధతి కాదు అనే చర్చ జరుగుతోంది. కొంత మంది నాయకులు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ పోయినట్లు లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it