పట్టాభిది దారుణమైన భాష
ఏపీలో రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పరిణామాలపై డీజీపీ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో టీడీపీ నేత పట్టాభి మాట్లాడింది.. చాలా దారుణమైన భాష అని అన్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నవారిపై దుర్భాషలాడటం సరికాదన్నారు. ''పట్టాభి వ్యాఖ్యల తర్వాతే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదు. ఇలాంటి భాషను సమాజంలో ఎవరూ అంగీకరించరు. పట్టాభి మాట్లాడిన భాష గతంలో ఎన్నడూ వినలేదు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలని డీజీపీ సూచించారు. పట్టాభి వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయన్నారు. ఒక్కసారి కాదు.. పదేపదే పట్టాభి దూషణలు చేశాడు. పట్టాభి వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం.
గత కొన్ని రోజులుగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తాం. దీని వెనుక ఎలాంటి కుట్ర ఉన్నా దర్యాప్తులో బయటపెడతాం. నిన్న సాయంత్రం 5.03 నిమిషాలకు వాట్సాప్‌లో ఒక కాల్ వచ్చింది. కాల్ చేయగానే ఎస్పీ తక్షణమే స్పందించారు. నిరాధార ఆరోపణలు కరెక్టు కాదని డీజీపీ అన్నారు. విజయవాడకు డ్రగ్స్‌తో ఏమాత్రం సంబంధం లేదన్నారు. అయినా కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్పష్టంగా చెప్పినా పదేపదే ఆరోపణలు సరికాదన్నారు. ఆరోపణలు చేయవద్దని చెబుతున్నాం. గుజరాత్‌లో దొరికిన డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు. ఒక గ్రామ్ కూడా విజయవాడకు రాలేదన్నారు.