Telugu Gateway
Andhra Pradesh

తప్పులు టీడీపీవి..దిద్దుబాట్లు జనసేనానివా?

తప్పులు టీడీపీవి..దిద్దుబాట్లు జనసేనానివా?
X

ఆంధ్ర ప్రదేశ్ అధికారిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రభుత్వంలో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏదైనా అధికారిక సభలో అయినా కూడా ముఖ్యమంత్రి మాత్రమే చివరిగా మాట్లాడతారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. తాజాగా తిరుపతి పర్యటన విషయంలో కూడా ఇది మరో బహిర్గతం అయింది అనే చర్చ సాగుతోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు పరిశీలించి వెళ్లిన తర్వాత ఉప ముఖ్యమంత్రి వచ్చి పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పర్యటనను ఎవరూ తప్పు పట్టారు. కానీ ఆయన నిజంగా ఆ ప్రాంతంలో పర్యటించి..బాధితులను పరామర్శించాలి అనుకుంటే సీఎం కంటే ముందే ఆ పని చేసి ఉంటే కరెక్ట్ గా ఉండేది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. కానీ అలా కాకుండా సీఎం తో తనకు ఏమీ సంబంధం లేదు..ఈ ప్రభుత్వంలో తమది ఒక ప్రత్యేక వ్యవస్థ అన్నట్లు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది. అందుకే కొంత మంది అధికారులు ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సూపర్ సీఎం గా వ్యవహరిస్తున్నారు అని వ్యాఖ్యానిస్తున్నారు.

సీఎం చంద్రబాబు ఏర్పాట్లు చేయటంలో విఫలం అయిన ఈఓ తో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం తిరుపతిలో తప్పు జరిగింది క్షమించండి అని కోరారు. టీటీడీ ఈఓ శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి బాధ్యతల నిర్వహణలో విఫలం అయ్యారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోంది అన్నారు. ఆ అధికారులను అక్కడ నియమించింది కూడా ప్రభుత్వమే కదా మరి. కొద్ది రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ వేదిక పై నుంచి మాట్లాడుతూ ఇలా అయితే హోమ్ శాఖను తాను తీసుకోవాల్సి వస్తుంది అని వ్యాఖ్యానించారు. మంత్రుల శాఖల కేటాయింపు సీఎం విచక్షణ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంతే కానీ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఎవరు ఏది కోరుకుంటే అది ఇవ్వరు. కొద్ది రోజుల క్రితం కాకినాడ పర్యటన సందర్భంగా కూడా బియ్యం అక్రమ రవాణా విషయంలో సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను వదిలేసి వనమాడి వెంకటేశ్వర రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే మీరు ఏమీ చేస్తున్నారు అంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఒక ఎజెండా ప్రకారం తప్పులు..పొరపాట్లు అన్ని టీడీపీ వాళ్ళు చేస్తుంటే తాను మాత్రం వాటిని సరి చేస్తున్నట్లు ప్రచారం కల్పించుకుంటున్నారు అన్న చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది.

Next Story
Share it