Telugu Gateway
Andhra Pradesh

ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ నో

ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ నో
X

వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మేమే చెబుతాం

ఏపీలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల రగడ మొదలైంది. ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ, కరోనా కారణంగా ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేదని ప్రభుత్వం. ఎవరి వాదనలు వారు విన్పిస్తున్నారు. ఈ తరుణంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని తలపెట్టారు. ఈ మేరకు సమాచారం అందజేశారు. అయితే దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అడ్డుచెప్పారు. ఈ మేరకు ఆమె ఎస్ఈసీకి ఓ లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటే అప్పుడు ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ఎస్ఈసీని సంప్రదిస్తుందని అందులో పేర్కొన్నారు. ''కరోనా కట్టడికి రాష్ట్రాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి.

ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించింది. ఏపీలో 6,890మంది కరోనా వల్ల ఇప్పటికే మృతి చెందారు. మరోసారి కరోనా ప్రబలేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదముంది. ఇప్పటికే పరిపాలన సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది, వివిధశాఖల ఉద్యోగులు కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. స్థానిక సంస్థల నిర్వహణకు పరిస్థితి అనుకూలించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణపై సమాచారం ఇస్తుంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ఎన్నికల నిర్వహణపై మీ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలి. ' అని సీఎస్ తన లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it