సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు జీవోను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

ఏపీ సర్కారు కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సినిమా టిక్కెట్ల ధరల ఖరారుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వానికి సినిమా టిక్కెట్ ధరలు నిర్ణయించే అధికారం లేదంటూ థియేటర్ల యాజమానులు హైకోర్టును ఆశ్రయించారు. పాత పద్దతిలో రేట్ల ఖరారుకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది టాలీవుడ్ కు పెద్ద ఊరటగా చెప్పొచ్చు. త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న తరుణంలో హైకోర్టు నిర్ణయం పరిశ్రమ వర్గాలు మాత్రం హ్యాపీగా ఫీలయ్యే ఛాన్స్ ఉంది.
డిసెంబర్ 17న పుష్ప రానుండగా..డిసెంబర్ 24న శ్యామ్ సింగరాయ్, జనవరి 7న ఆర్ఆర్ఆర్, జనవరి 12న బీమ్లానాయక్, జనవరి 14న రాధే శ్యామ్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులకు సినిమా టిక్కెట్ల ధరలను అందుబాటులో ఉంచేందుకే ప్రభుత్వం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. బడ్జెట్ తో సంబంధం లేకుండా ఏ సినిమాకు అయితే ఒకటే ధర అన్నది ప్రభుత్వ విధానం అని సర్కారు చెబుతూ వస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదిక కోరిన హైకోర్టు జీవో 35ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. దీంతో కొత్తగా వచ్చే సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు లభించనుంది.