మూడు రాజధానుల బిల్లు రద్దుకు మండలి ఆమోదం
నిన్న అసెంబ్లీ, నేడు మండలి. మూడు రాజధానుల బిల్లు రద్దుకు మంగళవారం నాడు మండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని.. అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ రద్దు బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. ఒక ప్రాంతమే ఎక్కువగా అభివృద్ధి చెందడంతో ప్రత్యేకవాదం వచ్చిందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది.
అందుకే అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం అమాయకుల నుంచి 33వేల ఎకరాలను సేకరించిందని, ఎక్కడా లేనట్లు 7500 చ.కి.మీటర్లలో రాజధానిని కడతామన్నారని విమర్శించారు. 50వేల ఎకరాల్లో రాజధాని కట్టాలంటే కనీస అవసరాలకే రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ఒకే చోట అన్ని సంస్థలు పెడితే ఏ ప్రాంతమూ అభివృద్ధి చెందదు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం ఎంతైనా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.