Telugu Gateway
Andhra Pradesh

సీఎంఓ పేరు చెప్పి దోపిడీనా!

సీఎంఓ పేరు చెప్పి దోపిడీనా!
X

ప్రభుత్వ శాఖలు వివిధ పనుల కోసం కాంట్రాక్టులు ఇవ్వటం సహజం. కానీ ఏకంగా ఒక ప్రభుత్వ శాఖనే ఎంపిక చేసిన వ్యక్తులు ..సంస్థలకు కాంట్రాక్టు కు ఇవ్వటం అంటే అదో పెద్ద విచిత్రమే అవుతోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో అదే జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖలో ఏ పని అయినా వాళ్లకు తప్ప మరొకరికి కేటాయించే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ శాఖ మంత్రికి కూడా సంబంధం లేకుండా నేరుగా సీఎంఓ ద్వారా మొత్తం వ్యవహహారం నడిపిస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 108 , 104 సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, యువ నేతకు సన్నిహితుడుగా ప్రచారంలో ఉన్న దోనేపూడి పవన్ కుమార్ కు చెందిన భవ్య హెల్త్ సర్వీసెస్ కు కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వం లో ఇచ్చిన ధరల కంటే అధిక ధరలకు భవ్య హెల్త్ సర్వీసెస్ ఈ కాంట్రాక్టు లు దక్కించుకున్నా సేవలు మాత్రం ఏ మాత్రం బాగాలేవు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అసలు ఈ టెండర్ కేటాయింపులోనే పెద్ద గోల్ మాల్ జరిగింది అని...ఒక ముంబై కంపెనీని రేస్ నుంచి తప్పించి ఈ సంస్థకు పనులు కేటాయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కూడా అలాంటిదే మరో భారీ కాంట్రాక్టు లను అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. అయితే ఒకే కంపెనీ పేరు మీద పనులు అన్నీ దక్కించుకుంటే ఇబ్బందులు వస్తాయని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పాగావేసిన ఆ వ్యక్తి తనకు సన్నిహితుడు...వ్యాపార భాగస్వామి అయిన వ్యక్తిని కూడా రంగంలోకి దింపి ‘ప్రమోదం’గా పని పూర్తి చేయించుకునే పనిలో ఉన్నారు. ఇద్దరూ కలిసి వందల కోట్ల రూపాయల పనులు దక్కించుకునేందుకు స్కెచ్ అంతా సిద్ధం చేశారు. సీఎంఓ అండదండలు ఉండటంతో వైద్య శాఖ అధికారులు కూడా ఏమి చేయలేక వీళ్ళు కోరుకున్నట్లు చేసిపెడుతున్నారు అని ఒక సీనియర్ ఐఏఎస్ వెల్లడించారు.

వైద్య ఆరోగ్య శాఖలో వీళ్ళ హవా ఎలా ఉంది అంటే అధికారులు మంత్రిని కలవాలని చెప్పినా కూడా తాము సీఎంఓ తో చెప్పి పనులు చేయించుకుంటుంటే మంత్రిని కలవాల్సిన అవసరం ఏముంది అని వ్యాఖ్యానించటంతో అవాక్కు అవటం అధికారులు వంతు అయింది. త్వరలోనే సిటీ స్కాన్ మిషన్ల ఏర్పాటు తో పాటు ఇతర పనులు కూడా వీళ్లకు కేటాయించే అవకాశం ఉంది అని అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క వైద్య శాఖలోనే కాదు వీళ్ళు ఇతర శాఖల్లో కూడా గతానికి బిన్నంగా పనులు దక్కించుకుని అడ్డగోలుగా ఖజానాకు తూట్లు పొడుస్తున్నా ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండటంతో ఇది అంతా కలిసి చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టెండర్ నిబంధలు సహజంగా సేవలు మెరుగా అందేలా...ప్రజలకు ప్రయోజనం కలిపించేలా ఉండాలి. కానీ ఏపీ విద్య ఆరోగ్య శాఖలో మాత్రం ఎంఐపిక చేసిన వ్యక్తులు..సంస్థలకు అనుకూలంగా వీటిని మార్చుతున్నారు.

Next Story
Share it