Telugu Gateway
Andhra Pradesh

షర్మిల చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్

షర్మిల చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్
X

రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ అది ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఇవి దేశంలో ఎక్కడ ఉండని రీతిలో ఉంటాయనే చర్చ కూడా ఉంది. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఈ బాష కూడా పూర్తిగా మారిపోయింది. నిత్యం తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసే జగన్ కు ఈ సారి చిక్కొచ్చి పడింది. తాజాగా వై ఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆమె వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలే చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో దోచుకోవటం..దాచుకోవటం తప్ప మరేమి లేదు అంటూ అన్న పాలనపై ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జగన్ ను ఆమె జగన్ రెడ్డి అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఉరవకొండ లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ ఇటీవల కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన షర్మిల వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారా అని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే జగన్ మాత్రం షర్మిల పేరు ఎత్తకుండానే ఆమెపై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకుకష్టపడుతున్నారు అన్నారు. అదే సమయంలో షర్మిల తో పాటు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ లు గా పనిచేస్తున్నారు అని విమర్శించారు.

అయితే తనకు మాత్రం తన పథకాల లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్ లు అంటూ..తనకు రికార్డు స్థాయిలో ఎవరకి లేనంత మంది స్టార్ క్యాంపెయినర్ లు ఉన్నారని చెప్పుకున్నారు. జగన్ తీరు ఇలా ఉంటే మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా లో పర్యటించిన షర్మిల మాత్రం సీఎం జగన్ పై డైరెక్ట్ ఎటాక్ మోడల్ నే ఫాలో అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం బీజేపీ కి ఊడిగం చేస్తుంది అని ఆరోపించారు. ఇరవై ఐదు మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా ఎలా రాదో చూస్తా...కేంద్రం మెడలు వంచుతా అన్న జగన్ మాటలు ఏమి అయ్యాయని ప్రశ్నించారు. ఏపీ లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది అని సంచలన వ్యాఖలు చేశారు. షర్మిల తన విమర్శల ద్వారా బీజేపీ, వైసీపీ ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై సంతకం పెడతారు అన్నారు. వైసీపీ నేత వై వి సుబ్బారెడ్డి చేసిన సవాల్ పైన కూడా షర్మిల స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తే రావటానికి తాము సిద్ధం అని...తేదీ, టైం అయన చెప్పినా ఓకే....తనను చెప్పమన్న ఓకే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా ఒకే రోజు అన్న, చెల్లెలి మధ్య సాగిన రాజకీయ విమర్శలు ఆసక్తికరంగా మారాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Next Story
Share it