Telugu Gateway
Andhra Pradesh

జగన్ జీరో సీఎం

జగన్ జీరో  సీఎం
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ పై రోజుకో కొత్త విమర్శ చేస్తున్నారు. ఇటీవలే జగన్ ను ఫేక్ సీఎం అంటూ సంభోదించిన చంద్రబాబు గురువారం నాడు జీరో సీఎం అంటూ వ్యాఖ్యానించారు. 'జగన్‌ ఒక జీరో సీఎం.. అవగాహన లేని ముఖ్యమంత్రి. టీడీపీ నేతలపై మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.. మాకు సభ్యత, సంస్కారం అడ్డొస్తున్నాయి. ఏకపక్షంగా అసెంబ్లీ నడుపుకుంటారా?..నడపండి చూద్దాం. మాకూ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అసెంబ్లీలో కూర్చొని భజన చేస్తారా? విశాఖలో విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటి?' అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదని విమర్శించారు. వైసీపీ వచ్చాక పెన్షన్లను భారీగా తొలగించారని ఆరోపించారు. టీడీపీకి చెందిన వారికి పెన్షన్‌, రేషన్‌ కట్‌ చేశారని చెప్పారు.

ఫేక్‌ మీడియాను పెట్టుకుని అసత్యాలు ప్రచారం చేశారన్నారు. రూ.200 పెన్షన్‌ను వెయ్యికి పెంచినట్లు తెలిపారు. టీడీపీ హయాంలో 44.32 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం అబద్దం చెప్పిందన్నారు. టీడీపీ హయాంలో 50.29 లక్షల మందికి పెన్షన్‌ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. పెన్షన్ల విషయంలో వైసీపీ తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. అసెంబ్లీని వైసీపీ నేతలు తప్పుదారి పట్టించారని ధ్వజమెత్తారు. వాస్తవాలు చెబితే అచ్చెన్నాయుడిపై 10 మంది ఎదురుదాడి చేశారని వివరించారు. టీడీపీ వాళ్లు అసెంబ్లీకి రాకూడదని అంటున్నారు.. అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా? అసెంబ్లీలో అధికారపక్షం డ్రామాలు ఆడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it