వైజాగ్ క్యాపిటల్ అని..ఇప్పుడు క్యాంపు ఆఫీస్ లు పెడుతున్నారు
గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న జగన్...తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచే ఇది అంతా చేశారా లేక చేశానని చెపుతున్న అభివృద్ధి ప్రాంతాల్లో అయన, అధికారులు రాత్రిళ్ళు కూడా మకాం వేసి పనులు చేయించారా?. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు అయితే ఈ ఎన్ సి లు, సీఈ లు ఇతర క్యాడర్ వాళ్ళు పనులు చేయించుతారు. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శి లేదంటే కార్యదర్శి పర్యవేక్షిస్తారు. సీఎం లేదా మంత్రి ఆయా ప్రాజెక్ట్ ప్రాధాన్యతను బట్టి సమీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ ను అయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే అలాంటి వాటికి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ (పీఎంయు)లను కూడా ఏర్పాటు చేస్తుంది. అంతే కానీ ప్రతి చోటకు సీఎం వెళ్ళి అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని పనులు చేయించరు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఎద్దేవా చేశారు. జగన్ తాను వైజాగ్ నుంచి పాలనా సాగిస్తానని ..త్వరలోనే అక్కడికి వెళతానని పలు బహిరంగ వేదికల మీద ప్రకటించారు. వ్యవహారం కోర్టు ల్లో ఉండటంతో ఏమి చెప్పాలో తెలియక ఇలా కొత్త కొత్త పేర్లతో వ్యవహారం నడిపిస్తున్నారు అని అయన అభిప్రాయపడ్డారు. అసలు అమరావతి లో ఉండటం జగన్ కు ఏ మాత్రం ఇష్టం లేదు అని...తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇక్కడ కొనసాగుతున్నారు అని వైసీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. సాంకేతికంగా చూస్తే సీఎం తనకు నచ్చిన చోట నుంచి పాలనా సాగించవచ్చు. దానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ రాజధానిగా ఒక ప్రాంతాన్ని పిలవాలి అంటే అంత కంటే ముందు పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉంటాయి.