జగన్ పాదాభివందనం..ట్రోలింగ్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పాదాభివందనం చేశారు. గతంలో అంటే సీఎం అయిన కొత్తలో ఒకసారి ప్రధాని మోడీ కి కూడా పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు. అయితే మోడీ దాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు. ఇప్పుడు జగన్ రాష్ట్రం వీడి వెళుతున్న గవర్నర్ కు పాదాభివందనం చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోలను ఆసరా చేసుకుని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు దిగింది. కొబ్బరికాయ కొట్టడానికి వంగని జగన్ ...పాదాభివందనానికి మాత్రం పూర్తిగా వంగారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కడప స్టీల్ ప్లాంట్ రెండవసారి శంఖుస్థాపన సమయంలో జగన్ కొబ్బరి కాయ కొట్టడానికి ఇద్దరు పూజారులు ఒక పెద్ద రాయిని ఎత్తిపట్టుకోవటం కూడా తీవ్ర చర్చనీయాంశగా మారింది.
గతం లో మంత్రి వర్గ విస్తరణ సమయంలో అయన కంటే వయసులో చాలా పెద్ద వాళ్ళు కూడా సీఎం జగన్ జగన్ కు పాదాభివందలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో సీఎంలు, గవర్నర్ల మధ్య రచ్చ నడుస్తుందా ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నంత కాలం ఎలాంటి వివాదాలు లేకుండా అంతా సాఫీగానే సాగిపోయింది. కేంద్రం చెప్పిన చోట తప్ప మిగిలిన రాష్ట్రాల్లో గవర్నర్ లు ఎక్కడ వివాదాలకు కాలు దువ్వటం లేదు అనే చర్చ కూడా ఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలోని పెద్దలకు, సీఎం జగన్ కు మధ్య సన్నిహిత సంబంధాలే దీనికి కారణం అయి ఉంటుంది అనే చర్చ కూడా అధికార వర్గాల్లో ఉంది.