Telugu Gateway
Andhra Pradesh

ఎన్నికలు బాగా జరుగుతాయి అన్న నమ్మకం పోతోంది

ఎన్నికలు బాగా జరుగుతాయి అన్న నమ్మకం పోతోంది
X

నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి క్షేత్ర స్థాయి పరిస్థితులపై స్పష్టత వచ్చేసిందా?. లేక పోతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాటలు మాట్లాడారు అంటే ఎవరికైనా ఇదే అనుమానం కలగక మానదు. సోమవారం నాడు ఎన్నికల ప్రచారం లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి అనే చెప్పాలి. రాష్ట్రంలో ఎన్నికలు బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకూ సన్నగిల్లుతోంది అని జగన్ మచిలీపట్నం సభలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించి బటన్లు నొక్కిన సందర్భాల్లో కూడా డబ్బులు కావాలని అక్క, చెల్లెమ్మలు పోకుండా ఆపుతున్నారు. ఇష్ఠానుసారంగా అధికారులు అందరిని కూడా మార్చేస్తున్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తున్నారు. ఇన్ని కుట్రలు చేస్తున్నారు. ఎందుకు....పేదలకు మంచి చేసే జగన్ ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఎక్కడైనా బటన్ నొక్కితే వెంటనే ఆ డబ్బులు ప్రజల ఖాతాల్లో పడాలి. పడతాయి. కానీ ఎప్పుడో నొక్కిన బటన్లకు ఇప్పుడు అంటే ఎన్నికలకు కేవలం వారం రోజుల ముందు వేసేలా ప్లాన్ చేశారు అంటే దీనివెనుక రాజకీయ కోణం ఉంది అనే అనుమానాలు రాక మానవు.

పైగా జగన్ ఇప్పటికే గత ఐదేళ్ల కాలంలో ప్రజల ఖాతాల్లో 2 .70 లక్షల కోట్లు డీబీటి ద్వారా వేశానని..మీకు మంచి జరిగితేనే ఓట్లు వేయమని చెప్పి..ఇప్పుడు ఒక్క విడత ఆగిపోతే జగన్ పై లబ్ధిదారులు ఓటు వేయకూడదు అన్నంత కోపం పెంచుకుంటారా అంటే ..కచ్చితంగా నో అనే చెప్పొచ్చు. అధికారులను ఇష్టానుసారం మారుస్తున్నారు అంటూ జగన్ ఇప్పుడు ఆరోపించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆరోపణలు వచ్చిన అధికారులను మార్చింది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు..పలు రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరిగింది అన్న విషయం జగన్ కు తెలియంది కాదు. వైసీపీ అధినేతగా అంతా తానే అయి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ...ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఎన్నికలు బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజు కు సన్నగిల్లుతున్నాయి అని చెప్పారంటే ఇది ఖచ్చితంగా పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతం పంపే ప్రమాదం ఉంది అనే ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఇలాంటి ఆరోపణలు చేస్తాయి. కానీ జగన్ మాత్రం అందుకు బిన్నంగా ఆయనే సీఎం గా ఉండి ఇంతటి కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఎక్కడో లెక్క తేడా ఉంది అన్న అనుమానాలు రావటం ఖాయం అని చెప్పొచ్చు.

Next Story
Share it